మనమ్మాయికి అట్లాంటా ఇన్నొవేటర్ అవార్డు..!
By అంజి Published on 16 Dec 2019 4:13 PM ISTమన హైదరాబాద్ మూలాలున్న ఒక చిన్నారి అమెరికాలో పర్యావరణ స్పృహను పెంచుతూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. పాతికేళ్ల లోపు వయసున్న వారిలో సేవ, పరిశ్రమ, పర్యావరణం వంటి అంశాల్లో ప్రశంసనీయమైన పనిని చేసిన వారికి ఇచ్చే అట్లాంటా ఇన్నొవేటర్ అవార్డులు ఈ అమ్మాయి అందుకుంది. పర్యావరణ స్పృహను పెంపొందించినందుకు, అవగాహనను పెంచినందుకు గాను రియా ఉప్పలపాటి అనే ఈ అమ్మాయికి అవార్డునిచ్చారు. రియా 'ఇన్ మై బ్యాక్ యార్డ్ -ఎ పర్సనల్ స్టోరీ ఆఫ్ ది డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పెట్రోలియం ఆన్ అవర్ ఎన్ వైరాన్ మెంట్ అండ్ ఎకానమీ' అన్న పుస్తకాన్ని కూడా వ్రాశారు. ఈ పుస్తకంలో పెట్రోలియం, చమురు కంపెనీల వల్ల తలెత్తే సమస్యల గురించి ఆమె చర్చించింది.
తమ చుట్టూ, ముఖ్యంగా తమ పరట్లో ఏం జరుగుతోందో, పర్యావరణ పరమైన సమస్యలు ఎలా భయంకర రూపాన్ని దాలుస్తున్నాయో ఆమె ఈ రచనలో వివరించింది. వీటి గురించి తెలుసుకుంటే ప్రజలు శక్తివంతంగా, సమర్థవంతంగా తమ చుట్టూ ఏం జరుగుతుందో చెప్పగలరని ఆమె భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చారు. రియా ఫరెవర్ ఎర్త్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు. స్థానికంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణపరంగా అవగాహనను పెంచే దిశగా ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థ హైదరాబాద్, అట్లాంటాలలో చెరొక విద్యార్థి ట్యూషన్ ఫీజు దృష్ట్యా ఆర్ధిక సాయం చేస్తోంది.
ఆమె తాతయ్య ఉప్పలపాటి సుబ్బారావు బీ ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో గతంలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు.