ఆ ద‌ర్శ‌కుడు చ‌నిపోలేదు.. కోలుకోవాల‌ని ప్రార్ధిద్దాం..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Aug 2020 7:34 AM GMT
ఆ ద‌ర్శ‌కుడు చ‌నిపోలేదు.. కోలుకోవాల‌ని ప్రార్ధిద్దాం..

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు నిషికాంత్‌ కామత్‌ అనారోగ్యంతో కన్నుమూశారంటూ ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ ట్వీట్ల ద్వారా తెలిపారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసిన‌ట్టు స్ప‌ష్టం చేశారు. అయితే అత‌ను ఇంకా బ్ర‌తికే ఉన్నాడ‌ని జెనీలియా భ‌ర్త రితేష్ దేశ్ ముఖ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.నిషికాంత్ కామ‌త్ ప్ర‌స్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. అత‌ను చనిపోలేదు. అత‌ను కోలుకోవాల‌ని ప్రార్ధిద్దాం అంటూ రితేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కొద్ది సేప‌టి క్రితం సినీ నటి రేణు స‌హాని, ఫిలిం మేక‌ర్ మిల‌ప్ జ‌వేరి ఆయన చనిపోయారంటూ ట్వీట్స్ చేశారు. దీంతో ట్వీట్ వైర‌ల్ అయి కామ‌త్ చ‌నిపోయాడంటూ సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

కామ‌త్ కొద్దిరోజుల క్రితం.. అనారోగ్యం కార‌ణంగా చికిత్స నిమిత్తం ఆసుప‌త్రిలో చేరారు. కామత్.. అజయ్ దేవ్‌గన్ హీరోగా న‌టించిన‌ దృశ్యం సినిమాకు దర్శకత్వం వహించారు. మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్‌లో ప్ర‌తిభావంతుడైన డైరెక్ట‌ర్‌గా పేరు సంపాదించారు.

నిషికాంత్ కామత్.. ద‌ర్శ‌కుడిగానే కాకుండా కొన్ని మరాఠీ చిత్రాలలో కూడా నటించాడు. అలాగే.. 2005లో మరాఠీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం డొంబివాలి ఫాస్ట్‌కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మరాఠీ సినిమాలో ఆ సంవత్సరం అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా.. 2016 లో జాన్ అబ్రహం హీరోగా నటించిన రాకీ హ్యాండ్సమ్ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించారు.

Next Story