మ‌రో దిగ్గజాన్ని కోల్పోయిన ఇండియ‌న్ సినిమా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 April 2020 4:51 AM GMT
మ‌రో దిగ్గజాన్ని కోల్పోయిన ఇండియ‌న్ సినిమా

ఇండియన్ సినిమా నేడు మ‌రో దిగ్గ‌జ న‌టుడిని కోల్పోయింది. నిన్న ఇర్ఫాన్ ఖాన్ మ‌ర‌ణం నుండి అభిమానులు కోలుకోక ముందే నేడు అల‌నాటి మేటి న‌టుడు రిషి కపూర్ క‌న్నుమూశారు. రిషి కపూర్ ముంబైలోని సర్‌ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. రిషి మ‌ర‌ణ‌వార్త‌ను అతని సోదరుడు రణధీత్ కపూర్ ధృవీకరించారు.

రిషి క‌పూర్‌ బొంబాయిలోని చెంబూర్లో పంజాబీ కుటుంబంలో జన్మించాడు. రిషి.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు రాజ్ కపూర్, కృష్ణ రాజ్ కపూర్ ల రెండ‌వ సంతానం. ముంబైలోని క్యాంపియన్ స్కూల్‌‌, అజ్మీర్ లోని మాయో కాలేజీలో అత‌ని విద్యాబ్యాసం జ‌రిగింది. రిషి మొట్ట‌మొద‌ట‌గా శ్రీ 420 చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు.



శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న రిషి బుధవారం ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయ‌న ఈ రోజు ఉద‌యం 9.32గంల‌కు క‌న్నుమూశారు. రిషి చ‌నిపోయార‌న్న వార్త తెలిసిన బిగ్‌బి అమితాబ్ ట్విట‌ర్ ద్వారా స్పందించారు. రిషి మ‌ర‌ణంతో నా హృద‌యం బ‌ద్ద‌లైంద‌ని అమితాబ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రిషికి 2018 లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. 11 నెలలకు పైగా అమెరికాలో ఉండి చికిత్స చేయించుకున్నారు. అతను 2019 సెప్టెంబరులో భారతదేశానికి తిరిగి వచ్చాడు. అనంత‌రం ప‌లు కార్య‌క్ర‌మాల‌లో కూడా ఆయ‌న పాల్గొన్నారు.

ఇదిలావుంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రిషి కపూర్ చివరిసారిగా ఏప్రిల్ 2న.. తన ఆరోగ్యం పట్ల కుటుంబం, అభిమానులు, స్నేహితులు చూపుతున్న శ్రద్దకు తాను చాలా సంతోషిస్తున్నానని ట్విట‌ర్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇంతలోనే అతనిని మృత్యువు కబళించింది.

ఇక రిషి క‌పూర్ న‌టించిన అనేక‌ చిత్రాలు బాలీవుడ్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. అందులో కొన్ని తెలుగు నాట కూడా రీమేక్‌ల రూపంలో వ‌చ్చాయి. ముఖ్యంగా రిషి క‌పూర్‌, శ్రీదేవి, అమ్రిస్ పురి ప్ర‌ధాన తారాగ‌ణంగా 1986లో హిందీలో విడుద‌లై విజ‌య‌వంత‌మైన 'న‌గినా' చిత్రం తెలుగులో 'నాగిని'గా రీమేక్ అయ్యి విజ‌య‌వంత‌మైంది.

Next Story