రిలయన్స్ మరో ఘనత..  ప్రపంచంలోనే అంత విలువైనదట

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 July 2020 12:12 PM IST
రిలయన్స్ మరో ఘనత..  ప్రపంచంలోనే అంత విలువైనదట

ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకెళుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇటీవల కాలంలో వరుస పెట్టి హెడ్ లైన్స్ లో తరచూ కనిపిస్తోంది. నిన్నటివరకూ జియోలో వాటాల అమ్మకాలతో అందరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. సంస్థను రుణ రహితం చేస్తానంటూ తానిచ్చిన మాటను గడువు కంటే ముందే సాధించిన అందరిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తిన ముకేశ్ అంబానీ ఇప్పటికే పలు రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా రిలయన్స్ మరో ఘనను సొంతం చేసుకుంది.

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూసినప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థ జాబితాలో 51వ స్థానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సంస్థ క్యాపిటలైజేషన్ రూ.12లక్షల కోట్లను దాటేయటం తెలిసిందే. సోమవారం రిలయన్స్ ఇంట్రాడే రికార్డు గరిష్ఠ స్థాయి రూ. 1947ను టచ్ చేసింది. దీంతో.. మార్కెట్ క్యాప్ రూ.12.34లక్షల కోట్లకు చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ సంస్థగా సౌదీకి చెందిన అరామ్ కో అగ్రస్థానంలో నిలిస్తే.. తర్వాతి స్థానాల్లోఆపిల్.. మైక్రోసాఫ్ట్.. అమెజాన్.. ఆల్పాబెట్ (గూగుల్) తదితర సంస్థలు నిలిచాయి. ఇలా యాభై స్థానాల్లో వేర్వేరు కంపెనీలు ఉంటే.. 51వ స్థానంలో రిలయన్స్ నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టాప్ 50లో 34కంపెనీలు అమెరికాకు చెందినవి కాగా.. కేవలం తొమ్మిది సంస్థలు మాత్రమే ఆసియా ఖండానికి చెందినవి. ఇప్పటికే రిలయన్స్ ఆసియాలో టాప్ 9వ సంస్థగా నిలిచింది. ఒకటి తర్వాత ఒకటిగా రిలయన్స్ సాధిస్తున్న విజయాల్ని చూస్తే.. రానున్న రోజుల్లో మరింత విలువైన కంపెనీగా రిలయన్స్ అవతరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Next Story