బియ్యం కార్డు ఉంటే.. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు
By తోట వంశీ కుమార్ Published on 26 July 2020 8:20 AM ISTఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం కార్డు కలిగిన వారికి ప్రత్యేకంగా ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బియ్యం కార్డు ఆదాయానికి కొలమానం అని వెల్లడించింది. అంతేకాదు.. కార్డు లేని వారికి ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం(ఇన్‌కమ్ సర్టిఫికెట్) కాలపరిమితిని ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.
శనివారం ఉప ముఖ్యమంత్రిగా, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ ఈ మేరకు పైలుపై తొలి సంతకం చేశారు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కోసం బియ్యం కార్డుదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెల్లవలసిన అవసరం లేదని, ప్రజలకు ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ధర్మాన తెలిపారు. పేదలకు సొంతిల్లు ఉండాలనే సీఎం లక్ష్యం మేరకు ఆగస్టు 15న 30లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం..
రెవెన్యూ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు సత్వర పరిష్కాలు చూపాలని మంత్రి కృష్ణదాస్ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన భూ సర్వే, మాన్యువల్‌గా ఉన్న రికార్డుల కంప్యూటరీకరణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతముందు సచివాలయంలోని అయిదో బ్లాకులో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.