టీఆర్‌ఎస్‌ నేతల కమీషన్ల కక్కుర్తి.. ఎంపీ రేవంత్‌రెడ్డి ఫైర్‌..

By అంజి  Published on  23 Feb 2020 8:58 AM GMT
టీఆర్‌ఎస్‌ నేతల కమీషన్ల కక్కుర్తి.. ఎంపీ రేవంత్‌రెడ్డి ఫైర్‌..

ముఖ్యాంశాలు

  • తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షల మంది డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పొందే అర్హులు
  • 'పట్నం గోస' పేరు మీద కార్యక్రమం
  • తెలంగాణపై అవగాహన లేని వ్యక్తిని బీజేపీ కేంద్రమంత్రిని చేసింది

హైదరాబాద్‌: పట్టణ ప్రగతి పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తాను చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. త్వరలో జరగబోయే గ్రేటర్‌ ఎన్నికల కోసం.. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ పట్నం గోస పేరు కార్యక్రమం చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోందన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ల ఇళ్లు ఇస్తానని చెప్పి ఇన్ని నెలలు గడుస్తున్నా ఎలాంటి ఫలితం ప్రజలకు కలగలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

30 లక్షల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. గ్రేటర్‌ పరిధిలో 10 లక్షల మంది డబుల్‌ బెడ్‌ రూమ్ పొందే అర్హులు ఉన్నారని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ఏడాదిలో పూర్తి చేసి ఇస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారని అన్నారు. హైదరాబాద్‌ పరిధిలో ఒక లక్ష డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు ఇస్తామని కేవలం 108 మంది మాత్రమే ఇచ్చారని అన్నారు. ఎర్రవల్లిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, చింతమడకలో రూ.10 లక్షలు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఎర్రవల్లికి సర్పంచా..? లేకా చింతమడకకు ఎంపీటీసీనా? అంటూ రేవంత్‌ ప్రశ్నించారు.

కేసీఆర్‌ మాట నమ్మినందుకు పేద ప్రజలపై ఐదేళ్లలో ఒక్కో కుటుంబంపై 3 లక్షల భారం పడిందన్నారు. ఒక లక్షా 50 వేల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో 900 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల బకాయిలు చెల్లించలేకపోతుందని అన్నారు. పేదలకు అందించాల్సిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లపై టీఆర్‌ఎస్‌ నేతలు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు. రాజీవ్‌ స్వగృహ ఇండ్ల నిర్మాణం ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్నం గోస కార్యక్రమం చేపడితే బాగుంటుందన్నారు. కేసీఆర్‌ ఏ కార్యక్రమం చేపట్టినా రాజకీయం కోణం ఉంటుందని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

పేదల ఇండ్ల కోసం కేంద్ర ఇచ్చిన నిధులను దారి మళ్లీంచారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిన విషయాన్ని కేంద్రం దృష్టికి, పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రధానమంత్రి అవాస్‌ యోజన కింద వచ్చిన నిధులు పక్కదారి పట్టాయన్నారు. ప్రధాన మంత్రి అవాస్‌ యోజన నిధులు దారి మల్లుతుంటే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు రివ్యూ చేయడం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య ఉన్న అంతర్గత సంబంధాలపై ప్రజలు దృష్టిపెట్టాలని రేవంత్‌ పేర్కొన్నారు. తెలంగాణపై అవగాహన లేని వ్యక్తిని బీజేపీ కేంద్రమంత్రిని చేసిందని ఎద్దేవ చేశారు. ప్రధాని మోదీ పుట్టకముందు నుంచే తెలంగాణ రైల్వే స్టేషన్లు ఉన్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు.

Next Story