రాయిటర్స్ పై వైసీపీ ఫిర్యాదు చేస్తుందా.?

By అంజి  Published on  9 Feb 2020 3:19 AM GMT
రాయిటర్స్ పై వైసీపీ ఫిర్యాదు చేస్తుందా.?

అమరావతి: రాయిటర్స్ వంటి సుప్రసిద్ధ మీడియా సంస్థ కియా మోటర్స్ తరలింపుపై తప్పుడు వార్తను వ్రాయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది. ఈ విషయంపై అధికారికంగా రాయిటర్స్ కు ఫిర్యాదు చేయాలని, తప్పుడు కథనాలను వెలువరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయాలని జగన్ ప్రభత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ, ప్రయత్నాలతో కియా మోటర్స్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది. అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ తమిళనాడుకు తరలిపోతోందని రాయిటర్స్ కథనాన్ని వెలువరించడం, దానిని తక్షణమే భుజానికి ఎత్తుకుని విపక్ష తెలుగుదేశం ప్రచార యుద్ధం ప్రారంభించడం, దాన్ని తట్టుకోలేక ఒక రోజు రోజంతా ప్రభుత్వం తర్జనభర్జనలు పడటం తెలిసిందే. విచిత్రం ఏమిటంటే వైసీపీ ప్రభుత్వం చాలా మంది ప్రముఖ జర్నలిస్టులను, ఢిల్లీ సహా దేశమంతా సంబంధాలున్న యూనియనిస్టులను తన ప్రతినిధులుగా నియమించుకుంది. వీరికి భారీ జీతభత్యాలను కూడా ఇచ్చుకుంటోంది. కానీ వీరు ఈ తప్పుడు వార్తను గుర్తించడంలో, దానిపై పోరాటం చేయడంలో, వాస్తవాలు తెలియచేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి.

అంతే కాదు.. నిజానికి కియా మోటర్స్ ప్రచారం ఒక వైపు వైసీపీని చికాకు పరుస్తున్న సమయంలోనే చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులైన వారిపై ఐటీ సోదాలు జరిగాయి. అందులో చంద్రబాబుకు పీఏ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావు, లోకేశ్ కు సన్నిహిత మిత్రుడైన కిలారు రాజేశ్, చంద్రబాబు కుడిభుజం వంటి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు వంటి వారిపై ఐటీ సోదాలు మూడు రోజుల పాటు జరిగాయి. ఇవన్నీ ముంబాయికి చెందిన ఒకానొక సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త ఖాతాల నుంచి తెలుగునాట మరొకానొక ప్రముఖ రాజకీయ నేత ఖాతాల్లోకి రూ. 150 కోట్లు బదలాయించినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలోనే జరిగాయి. కానీ ఈ వార్తలకు జాతీయ పత్రికల్లో ఎలాంటి ప్రచారం లభించలేదు. కనీస కవరేజ్ సైతం లేదు. కియా మోటర్స్ తప్పుడు వార్తకు వచ్చిన ప్రచారం కూడా ఐటీ దాడులకు రాలేదన్నది గమనార్హం.

నిజానికి రాయిటర్స్ సంస్థ పిబ్రవరి 23, 2017 లో డిజిటల్ ట్రాన్స్ మిషన్ కోసం ఈ ప్రగతి పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రూ. 270 కోట్ల ఒప్పందం చేసుకుంది. అందులో రాయిటర్స్ కి రూ. 147 కోట్లు చెల్లించేట్టు ఒప్పందం జరిగిందని వార్తలు వచ్చాయి. ఈ ఒప్పందంలో చంద్రబాబుకు వియ్యంకుడైన నటుడు బాలకృష్ణ అల్లుడు భాగస్వామి అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. రాయిటర్స్ తరఫున తప్పుడు వార్త వ్రాసిన విలేఖరికి తెలుగుదేశం నేతలతో సన్నిహిత సంబందాలున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం ప్రచార యుద్ధంలో ఈ విషయాలను ఉపయోగించడంలోనూ వైసీపీ మీడియా మెషినరీ విఫలమైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో పునరాలోచన జరగకపోతే వైసీపీ జనాభిప్రాయాన్ని గెలుచుకునే యత్నాల్లో ఘోరంగా దెబ్బతింటుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.

లేఖ రాయాలని ప్రభుత్వ నిర్ణయం..

కియా మోటర్స్ కథనం విషయంలో సంస్థ తాము తమిళనాడుకు తరలిపోవడం లేదని స్వయంగా స్పష్టం చేసిన తరువాత కూడా రాయిటర్స్ తన కథనాన్ని ప్రచురించడం విశేషం. ఇప్పుడు ఆ వార్తను తొలగిస్తున్నట్టు రాయిటర్స్ మరో ట్వీట్ ను చేసింది. అయితే అదంతా గతజల సేతు బంధనమే. ఈ విషయంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాయిటర్స్ కు తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ లేఖరాయాలని నిర్ణయించుకుంది.

నిజానికి తన మీడియా మెషినరీలోని లోపాలను గుర్తించడానికి వైసీపీకి కియా మోటర్స్ ఉదంతం చాలా ఉపయోగపడుతుంది. తన కమ్యూనికేషన్ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఇది. దీనిని వైసీపీ ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందన్న విషయంపైనే ఈ ప్రచార యుద్ధంలో అది గెలుస్తుందా లేదా అన్నది తెలుస్తుంది.

Next Story