'ఆంటోని మరియు బిర్యానీ' ఓ హోటల్ యజమాని మానవీయ కథ.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 20 July 2020 7:36 PM ISTఒకవైపు ఇలాంటి విపత్కర పరిస్థితులు కనిపిస్తుంటే విచిత్రంగా పుదుచ్చేరిలోని ఓ హోటల్ యజమాని ఆంటోనీ తనకోసం తనను నమ్ముకున్న ఉద్యోగుల కోసం ప్రతి రోజూ ఆన్ లైన్ లో బిర్యానీ అమ్మకాలు షురూ చేశాడు. కరోనా నేపథ్యంలో హోటల్ నాలుగు నెలలుగా మూతపడింది. తిరిగి తెరచుకున్నా జనాలు రావాలంటే భయపడుతున్నారు. దీంతో ఆంటోనీ తన మదామే శాంతే రెస్టారెంట్ పంథా మార్చి ఆన్ లైన్ బిజినెస్ షురూ చేశాడు. నోరూరించే బిర్యానీ స్థానిక ప్రజలకు పార్శిల్ చేస్తూ...తన హోటల్ లో పనిచేసే ఉద్యోగులకు బాసటగా నిలిచాడు.. ఆసక్తికరమైన ఆంటోనీ కత ఇదీ..
పుదుచ్చేరి బౌలివార్డ్ లో ఆంటోనీ మదామే శాంతే పేరుతో ఓ ఫ్రెంచ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఈ హోటల్ కు స్థానికులు కన్నా విదేశీయులే ఎక్కువగా వస్తుంటారు. వారికి ఇక్కడి చికెన్ బిర్యానీ అంటే చచ్చేంత ఇష్టం. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోయేది. తన రెస్టారెంట్ లో పనిచేసే ఉద్యోగులను ఇంటి మనషులుగా ఆంటోనీ చూసుకునేవాడు. వారూ అంతే అభిమానంతో పనిచేసేవారు. మార్చిలో లాక్ డౌన్ ప్రకటించగానే అందరిలాగా తనూ హోటల్ షటర్లు మూసేశాడు. కరోనా ఎన్ని రోజులుంటుంది.. త్వరలో అంతా సర్దుకుంటుంది. ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేస్తుంది. ఇక మళ్లీ హోటల్ బిజినెస్ మొదలవుతుంది అనుకున్నా.. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. నాలుగు నెలలు గడచినా ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.
అంతకంతకు కరోనా విజృంభిస్తునే ఉంది. ఆంటోనీ హోటల్ లో 28 మంది ఉద్యోగులున్నారు. మొదటి రెండు నెలలు వారికి జీతం ఎలాగోలా ఇవ్వగలిగాడు. కానీ ఆ తర్వాత నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. మరి బిజినెస్సే లేకుంటే చేతిలో నాలుగు పైసలు ఎలా ఆడతాయి? లాక్ డౌన్ ఎత్తివేసి కొన్ని సడలింపులు ఇచ్చాక.. మళ్లీ హోటల్ ప్రారంభించాలనుకున్నాడు. తన బిజినెస్ పంథాను మార్చుకుని స్థానిక ప్రజలకు రుచిగా శుచిగా బిర్యానీ అందించడం ప్రారంభించాడు. మొదట్లా కాకుండా ఆన్ లైన్ లో ముందుగా బుక్ చేసుకన్న కస్టమర్లకు బిర్యానీ పార్శిల్ ను తన కార్ల ద్వారా వినియోగదార్లకు అందించాడు. రుచి అద్భుతంగా ఉండటంతోపాటు అన్నివిధాల జాగ్రత్తలు పాటిస్తుండటంతో ఆంటోనీ బిర్యానీ బిజినెస్ క్రమంగా పుంజుకుంది. తన ఉద్యోగులకు జీతాలిచ్చి వారిని అన్ని విధాల ఆదుకోగలుగుతున్నాడు.
కరోనా రావడంతో హోటల్ బంద్ పెట్టాల్సి వచ్చిందే అని ఆంటోనీ అధైర్య పడలేదు. వ్యూహాత్మకంగా పరిస్థితులకు అనుగుణంగా తన వ్యాపార పంథా మార్చుకుని ముందుకు సాగిపోయాడు. తన రెస్టారెంట్ లోనే చికెన్ బిర్యానీ వండి స్థానిక ప్రజలకు కారు రవాణా ద్వారా అందించడం మొదలెట్టాడు. లాక్ డౌన్ కన్నా ముందు రోజుకు ఒక కారునే పార్శిల్ బిజినెస్ కు వాడేవాడు. బిర్యానీ ధర కూడా రూ. 225 ప్లస్ జీఎస్టీగా ఉండేది. అయితే ప్రస్తుతం ప్యాకెట్ రూ.70కే విక్రయిస్తున్నాడు. ధర తగ్గింది కదా అని నాణ్యతలో ఏమాత్రం రాజీపడటం లేదు. అప్పుడు విదేశీయులకే బిర్యానీ సప్లయి చేస్తే ఇప్పుడు పక్కా లోకల్ బిజినెస్ చేస్తున్నాడు. మొదట్లో బోలేవర్డ్ లో 2కేజీల బిర్యానీ వండి పార్శిల్ చేయడం ప్రారంభించాడు. అయితే అరగంటలోనే బిర్యానీ ఖతం అయిపోయేది. డిమాండ్ పెరుగుతోందని గ్రహించిన అంటోనీ ఎక్కువ పరిణామంలో బిర్యానీ వండి పార్శిల్ పంపడం షురు చేశాడు. తన బిజినెస్ మంచిగా సాగడానికి స్థానిక ప్రజల సహకారమే కారణమని ఆంటోనీ అంటున్నారు. వర్కర్లు కూడా రోజూ ఉదయం 7గంటల నుంచి 11.30 గంటల వరకు అంటే సగం రోజు పనిచేసి వెళుతున్నారని వారికి తగినంత జీతం ఇస్తున్నానని ఆంటోని తెలిపారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిం దన్నట్టు.. ఈ కరోనా వస్తే వచ్చింది గానీ చాలామందికి ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి. ఇదో ఆర్థిక సంక్షోభం! నిన్న మొన్నటి దాకా మా పిల్లలు ఈ కంపెనీలో చేస్తున్నారు కళ్లు చెదిరే ప్యాకేజీ అంటూ మురిసిపోయిన తల్లిదండ్రులు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న బిడ్డల్ని ఎలా సముదాయించాలో తెలీకుండా దిక్కులు చూస్తున్నారు. చిన్నవాళ్లు సరే.. ఈ ఏడు నా జీవితంలోంచి తీసేస్తున్నా.. అంటూ సులువుగా అనేయగలుగుతున్నారు. కానీ పెళ్లయి పిల్లలున్న వారి సంగతేంటి? అదృష్టవశాత్తు ఆంటోనీ హోటల్ వర్కర్లకు ఇలాంటి దుస్థితి రాలేదు.
లాక్ డౌన్ ప్రకటించగానే చాలా మందిలా తనూ హోటల్ బంద్ చేసి ఉద్యోగులను తొలగించి ఉంటే ఇవాళ ఆంటోనీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. తను అందరికంటే భిన్నంగా మానవీయ కోణంలో ఆలోచించాడు. ఈ సందర్బంగా ఆంటోనీ మాట్లాడుతూ ఉద్యోగులు నా పిల్లలాంటి వారు. వారు ఇబ్బందిపడుతుంటే తట్టుకోలేక పోయాను. నన్ను నమ్ముకుని ఈ వృత్తి చేస్తున్నారు. ఈ కరోనా కష్టకాలంలో పొమ్మంటే ఎక్కడ పోతారు? మనం కూడా ఆలోచించాలి కదా.. అన్నడా గద్గద స్వరంతో. ప్రస్తుతం మొదట్లో ఇచ్చే జీతంలో 75 శాతం సొమ్ము అందుకుంటున్నారు. పరిస్థితులు చక్కబడితే మళ్లీ అందరికీ మంచి రోజులొస్తాయి అని ఆంటోనీ ఎంతో నమ్మకంగా చెబుతుంటే.. ఏదో చిన్న రెస్టారెంట్ వ్యాపారం చేసుకుంటూ బతుకుబండ నడుపుతున్న ఈ ఆంటోనీలో ఉన్న మానవత్వంలో కనీసం ఒకశాతం అన్నా బడాబడా కంపెనీలకు ఉంటే ఎంత బావుణ్ణు.. ఉద్యోగులూ తమ వారే కదా అన్న భావన రావాలంటే మనసులో మానవత్వం తొణికిసలాడాలి. అది ఆంటోనీలో పుష్కలంగా ఉంది. ఆంటోనీ లాంటి వారుంటే ఏ ఉద్యోగీ తన కొలువు పోయిందని కన్నీరు కార్చడు.. ఇది నిజం!!