పని మనిషి కుమార్తె పరీక్షల్లో టాప్.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 July 2020 11:44 AM GMT
పని మనిషి కుమార్తె పరీక్షల్లో టాప్.!

జంషెడ్ పూర్: రాజాకా బేటా అబ్ రాజా నహీ బనేగా.. రాజా వహీ బనేగా జో హక్ దార్ హోగా.. అన్నది సూపర్ 30 సినిమాలోని డైలాగ్..! 'రాజు కొడుకు మాత్రమే రాజు అవ్వగలడు అన్నది ఇప్పుడు జరగని పని.. ఎవరికి అయితే రాజుకు కావలసిన లక్షణాలు ఉంటాయో అతడే రాజవ్వగలడు' అని అర్థం. ఈ మాటను నిజం చేస్తూ టైలర్, పని మనిషి కుమార్తె ఝార్ఖండ్ బోర్డు ఎగ్జామ్స్(ఇంటర్మీడియేట్) లో టాపర్ గా నిలిచింది.

జంషెడ్ పూర్ విమెన్స్ కాలేజ్(జె.డబ్ల్యూ.సి.) లో చదువుతున్న నందిత 500 మార్కులకు గానూ 419 మార్కులను సాధించింది. తాను మంచి మార్కులు సాధిస్తానని ఊహించాను కానీ స్టేట్ ర్యాంక్ వస్తుందని అసలు ఊహించలేదని ఆమె మీడియాతో తెలిపింది.

నందిత తల్లిదండ్రులు రాజేష్ హరిపాల్, రష్మి దంపతులు తమ కూతురు సాధించిన ర్యాంకుకు ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. తమ ముగ్గురు బిడ్డలలో నందిత పెద్దదని తెలిపారు. నందితను చదివించడానికి ఆర్థికంగా తాము చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు. మెట్రిక్యులేషన్ పూర్తీ అయ్యాక నందిత ట్యూషన్స్ చెప్పుకుంటూ తన చదువుకు కావాల్సిన డబ్బును సంపాదించుకునేది. అలా తన చదువుకు కూడా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకునేది. ఆమె ప్రత్యేకంగా ఎలాంటి ప్రైవేట్ ట్యూషన్స్ కు కూడా వెళ్ళలేదు. హిందీలో 90, జియోగ్రఫీ లో 88, హిస్టరీ 85, ఇంగ్లీష్ లో 82, పొలిటికల్ సైన్స్ లో 74 మార్కులను ఆమె సాధించింది.

నా ఫీజులకు కావాలసిన డబ్బులను.. ట్యూషన్లు చెప్పి సంపాదించుకున్నాను, నాకు చదువుకోవడం ఎంతో ఇష్టం.. ఏది ఏమైనా చదువు కోవడాన్ని కొనసాగిస్తూనే ఉంటానని చెప్పింది. పెద్ద చదువులు చదువుకోడానికి తన తల్లిదండ్రులు స్వేచ్ఛను ఇచ్చారని ఆమె తెలిపింది.

డిబిఎంఎస్ స్కూల్ లో పదవ తరగతి వరకూ చదువుకుంది నందిత, గ్రాడ్యుయేషన్ పూర్తీ అయ్యాక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది తన ఆకాంక్ష అని తెలిపింది నందిత. జంషెడ్ పూర్ విమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ శుక్ల మహంతి నందిత ఇంటికి వెళ్లి ఆమెకు నగదు బహుమతితో పాటు, సిల్వర్ నాణెం, చేతి గడియారం బహుమానంగా ఇచ్చారు. ఆమె సాధించిన ఘనతకు తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

Next Story
Share it