మహేష్ సినిమాలో రేణు.. అసలు నిజం ఏంటంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jun 2020 11:24 AM IST
మహేష్ సినిమాలో రేణు.. అసలు నిజం ఏంటంటే?

ఒకప్పటి హీరోయిన్లు.. తర్వాతి కాలంలో అక్క, వదిన, తల్లి పాత్రలకు మారిపోవడం సహజం. తమకు జోడీగా నటించిన, తమతో పాటే కెరీర్లో ఎదిగిన హీరోల సినిమాల్లోనే తర్వాత సైడ్ క్యారెక్టర్లకు మారిపోతుంటారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా ఇప్పుడు ఓ క్యారెక్టర్ రోల్‌కు రెడీ అయినట్లుగా రెండు రోజులుగా గట్టిగా ప్రచారం సాగుతోంది. మహేష్ బాబు కొత్త సినిమాలో ఆమె ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.

రేణు కథానాయికగా నటించినపుడు మహేష్ స్టార్‌‌గా ఎదుగుతున్నాడు. పవన్‌తో పోటాపోటీగా సాగాడు. అలాంటిది ఇప్పుడు మహేష్ సినిమాలో పవన్ మాజీ భార్య ప్రత్యేక పాత్ర చేస్తోందనగానే అందరిలో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఐతే ఈ వార్తలో అసలు నిజమే లేదని తేల్చేసి.. ఈ కాంబినేషన్ కోసం చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లేసింది రేణు.

ఓ తెలుగు టీవీ ఛానెల్‌తో మాట్లాడిన రేణు.. మహేష్ సినిమాలో తాను నటిస్తున్నానన్న వార్త అబద్ధమని స్పష్టం చేసింది. '‘నేను విన్న అతి పెద్ద బేస్‌లేస్‌ రుమార్‌ ఇదే. రెండు మూడు రోజుల నుంచి చాలా మంది నాకు కాల్స్‌ చేసి విష్‌ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసిన వారికి హ్యాట్సాఫ్‌. వాళ్లు చెబుతున్న సినిమాతో నాకు ఏమాత్రం సంబంధం లేదు. నిజంగా అంత పెద్ద సినిమా ఒప్పకున్నప్పుడు తప్పనిసరిగా నేను ప్రకటన చేస్తాను. నాక్కూడా మళ్లీ నటించాలనే ఉంది.

గతంలో ఓ సందర్భంలో తల్లి పాత్రలకు అడిగినప్పుడు.. హీరో చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. దాన్ని ఆధారంగా‌ చేసుకుని ఎవరో ఇలాంటి వార్తలు సృష్టించారు'’ అని రేణు చెప్పింది. ఇక తన కొడుకు అకీరా నందన్ తెరంగేట్రం గురించి అడిగితే.. అది అతడి ఇష్టమని.. అకీరా సినిమాల్లోకి రావాలనుకుంటే సపోర్ట్ చేస్తానని.. కానీ తన కుటుంబంలో అందరూ సినిమాల్లో ఉన్నారు కాబట్టి తానూ అదే చేయాలన్న ఒత్తిడి మాత్రం తీసుకోవద్దని అకీరాకు తాను చెబుతానని.. తనకింకా 16 ఏళ్లే కాబట్టి భవిష్యత్తులో ఏం నిర్ణయించుకుంటాడో అతడి ఇష్టమని రేణు అంది.

Next Story