రూ. 5వేల రెమ్ డెసివిర్ ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారంటే?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 July 2020 12:19 PM ISTమాయదారి రోగం రాకుండా మందు లేదు. కానీ.. దాని మహమ్మారి సోకిన వారు త్వరగా కోలుకునేందుకు వీలుగా హెటెరో కంపెనీయాంటీ వైరల్ డ్రగ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ మందు రూ.5వేలుగా అప్పట్లో చెప్పారు. కంపెనీ చెప్పిన దాని ప్రకారం.. మహమ్మారి సోకిన వారు ఒక్కొక్కరు ఏడు రెమ్ డెసివిర్ బాటిళ్లను వాడితే మహమ్మారి బారి నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు.
ఈ లెక్కన ఒక్కో బాటిల్ ఐదువేలు చొప్పున ఏడు బాటిళ్లకు కలిపి రూ.35వేలుగా చెప్పాలి. అయితే.. ఈ మందుకు డిమాండ్ పెరగటం.. వేలం వెర్రిగా వాడేయటంతో లభించని పరిస్థితి. దీనికి తోడు ప్రజల్లో ఉన్న డిమాండ్ ను అసరా చేసుకొని కొద్దిమంది వ్యాపారులు ఈ మందును దాచేసి.. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఈ మందుధర ఎంత ఉందో తెలుసా? అక్షరాల రూ.30వేలుగా చెబుతున్నారు. అంటే.. ఒక రోగికి ఏడు బాటిళ్లను వాడాలంటే ఏకంగా రూ.2.10లక్షలు చెల్లించాల్సిందే. ఇంతకీ.. ఇంత డిమాండ్ ఎందుకు వచ్చిందంటే.. ఈ మందు అవసరం లేని వారు సైతం.. ముందస్తు జాగ్రత్త కోసం ముందే కొని పెట్టుకునేటోళ్లు ఎక్కువ అయ్యారు. దీంతో.. మార్కెట్లోకి స్టాక్ వచ్చిన వెంటనే సంపన్నులు దీని అవసరం లేకున్నా.. కొనేసి ఇంట్లో పెట్టేసుకుంటున్నారు.
ఈ డిమాండ్ ను సొమ్ము చేసుకోవటానికి వ్యాపారులు బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించటంతో సామాన్యులు ఇప్పుడు కొనలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి బ్లాక్ మార్కెట్ గాళ్లపై కొరడా ఝుళిపించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోవటంతో.. రెమెడెసివిర్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పక తప్పదు.