రిలయన్స్ భవితకు ఢోకా లేకుండా చేసే ఆ మూడు డీల్స్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 5:06 AM GMT
రిలయన్స్ భవితకు ఢోకా లేకుండా చేసే ఆ మూడు డీల్స్

దేశీయ కుబేరుడు కాస్తా.. అతి తక్కువ సమయంలోనే అపర కుబేరుడిగా మారటమే కాదు.. ప్రపంచంలోనే టాప్ 5 సంపన్నుల్లో ఒకరిగా మారారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంతో కిందా మీదా పడుతున్న వేళ.. మిగిలిన వారికి భిన్నంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేలా వ్యవహరించారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్న ఆయన వ్యూహాల్ని చూస్తే.. అచ్చెరువు చెందాల్సిందే.

ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలకు తన వాటాల్ని కొద్ది కొద్దిగా అమ్మటం ద్వారా బలోపేతమైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రానున్న కొద్ది రోజుల్లో మూడు డీల్స్ ను కుదుర్చుకోవటం కోసం రిలయన్స్ తీవ్రంగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. పారిశ్రామిక వర్గాల సమాచారం ప్రకారం ముకేశ్ అనుకుంటున్న ఆ మూడు డీల్స్ ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ మూడు డీల్స్ తో రిలయన్స్ మరింత బలోపేతం కావటమే కాదు.. ఆ కంపెనీ భవితకు తిరుగు ఉండదని చెబుతున్నారు. ఇంతకీ ఆ మూడు డీల్స్ ఏమంటారా? అక్కడికే వస్తున్నాం. ఎప్పటినుంచో రిలయన్స్ ఒప్పందం చేసుకోవాలనుకుంటున్న ఆరామ్ కో తో డీల్ ఫైనల్ అయితే చమురు నుంచి రసాయనాల వ్యాపారంలో రిలయన్స్ ను కొట్టే వారే ఉండరని చెబుతున్నారు. ఈ డీల్ ను ఫైనల్ చేసేందుకు ముకేశ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇటీవల కాలంలో తెర మీదకు వచ్చిన టిక్ టాక్ భారత వ్యాపారాన్ని కొనుగోలు చేయటం. ఇప్పుడున్న పరిస్థితుల్లో షాకింగ్ పరిణామాల్ని ఎదుర్కొంటున్న టిక్ టాక్ కు భారత్ లో ఎలాంటి అవకాశం లేదు. మొన్నటి వరకు ఒక వెలిగిన టిక్ టాక్.. కేంద్రసర్కారు నిర్ణయంతో రాత్రికి రాత్రి దాని బతుకు మొత్తం మారిపోయింది. ఇప్పటికే టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా పలు వేదికలు వచ్చినా.. టిక్ టాక్ ను దేశ ప్రజలు ఇప్పటికి మర్చిపోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ ను కొనుగోలు చేయాలన్న ఆలోచనలో రిలయన్స్ ఉంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ లాంటి భారీ వ్యాపార అవకాశాన్ని మిస్ అయిన టిక్ టాక్ కిందామీదా పడుతోంది. రిలయన్స్ లాంటి కంపెనీ భారత విభాగం వరకు కొనుగోలు చేయటానికి ముందుకు రావటం.. ఆసక్తిని చూపిస్తున్న నేపథ్యంలో టిక్ టాక్ ముకేశ్ వశం కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ డీల్ ఓకే అయితే.. రిలయన్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం మీద తిరుగులేని శక్తిగా ఆవిర్భవించే వీలుంది.

ఇక.. మూడో డీల్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఉన్న తన రిటైల్ వ్యాపారాన్ని మరింత పెద్దదిగా చేసుకోవటంతో పాటు.. ఈ విభాగంతో తనతో పోటీ పడేందుకు అవకాశం లేని రీతిలో ఎదగాలని ముకేశ్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రిటైల్ రంగంలో మొనగాడిగా ఉన్న ఫ్యూచర్ గ్రూపులో మెజార్టీ వాటాను సొంతం చేసుకోవాలన్న ప్లాన్ లో రిలయన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. రిటైల్ వ్యాపారంలో ముకేశ్ కు తిరుగు ఉండదని చెప్పక తప్పదు.

Next Story