సీఎం జగన్‌ను మెచ్చుకున్న రాశీఖన్నా..!

By అంజి  Published on  16 Dec 2019 5:56 AM GMT
సీఎం జగన్‌ను మెచ్చుకున్న రాశీఖన్నా..!

హైదరాబాద్: ఏపీలో దిశ చట్టాన్ని తీసుకువచ్చినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు టాలీవుడ్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా అభినందనలు తెలిపారు. మహిళపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా వైఎస్ జగన్‌ ప్రభుత్వం ఏపీలో దిశ చట్టాన్ని తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ దిశ చట్టం చాలా నిర్మాణాత్మకమైనదని, మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్న వారిలో ఈ చట్టం భయాన్ని కలిగిస్తుందన్నారు. ఇలాంటి బిల్లులు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకువచ్చి మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని హీరోయిన్‌ రాశీఖన్నా కోరారు.

మహిళల భద్రత, రక్షణ విషయంలోనే కాకుండా అత్యాచారాలు చేసిన నిందితులకు 21 రోజుల్లో శిక్షలు అమలు చేసే విధంగా కొత్త చట్టం తీసుకురావటంపై ఏపీ సీఎం జగన్‌కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకురావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయటం మంచి నిర్ణయమని, కఠిన చర్యలు తీసుకుంటూ కొత్త చట్టాలను తీసుకురావటంలో దేశంలోనే ఏపీ రాష్ట్రం ముందు ఉందని ప్రసంశిస్తున్నారు.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువడనుంది. వారం రోజుల్లోగా విచారణ పూర్తిచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అత్యాచారాలకు పాల్పడినట్లు ఖచ్చితమైన ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు సత్వరమే విచారణ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది”. అని తెలిపారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇక సోషల్ మీడియాలో మహిళలపై మొదటిసారి తప్పుగా పోస్టింగ్ పెడితో రెండేళ్ల పాటు జైలు శిక్ష, రెండోసారి పెడితే నాలుగేళ్లు జైలు శిక్ష, చిన్నారులను లైంగికంగా వేధిస్తే 7-14 ఏళ్లు జైలు శిక్ష అమలు చేస్తామని జగన్ పేర్కొన్నారు.

Next Story