రేప్‌ కేసుల తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేసిన 'సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్'

By Newsmeter.Network  Published on  7 Dec 2019 10:12 AM GMT
రేప్‌ కేసుల తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్

హైదరాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటన పార్లమెంట్ ను సైతం కుదిపేసింది. ఈ దారుణంపై కేంద్ర మంత్రులు కూడా స్పందించారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, తాజాగా రేప్‌ కేసులపై త్వరగా తీర్పులు చెప్పాలన దానిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. రేప్‌ కేసులు జరిగిన వెంటనే తీర్పు చెప్పడం సరికాదని సీజే అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ అనేది ప్రతీకారంగా మారితే న్యాయం రూపు రేఖలు కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు. కాగా, రేప్‌ కేసుల్లో త్వరగా తీర్పులు చెప్పాలన్న కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలతో సీజే విబేధించారు. ఎన్‌కౌంటర్లపై సీజేఐ బాబ్డే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. న్యాయం అనేది పగతీర్చుకోవడంలా ఉండొద్దన్నారు. న్యాయానికి ఉన్న లక్షణాలను మార్చాలని భావించవద్దని, ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాధారాల పరిశీలన తర్వాతే తీర్పు వస్తుందని చెప్పారు. అలాగే ఒక ఘటన జరగగానే తీర్పు తక్షణ రావాలని ఆశించవద్దని పేర్కొన్నారు.

Next Story