మూడు ముళ్ళేసేసిన రానా.. ఒక ఐకానిక్ బ్యాచిలర్ ఎండ్ ను చూశానంటున్న నాని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Aug 2020 11:01 PM ISTనటుడు రానా బ్యాచిలర్ లైఫ్ ముగిసింది. హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోస్ లో శనివారం(ఆగష్టు 8) నాడు రాత్రి 8:30 గంటల సమయంలో మూడు ముళ్లు వేశాడు. టాలీవుడ్ భల్లాలదేవుడు రానా ఓ ఇంటివాడయ్యాడు. ప్రేమించిన మిహీకా బజాజ్ ను రానా పెళ్లిచేసుకున్నాడు. కోవిద్-19 ప్రోటొకాల్స్ నేపథ్యంలో ఈ పెళ్ళికి అతి కొద్దిమంది అతిథులనే పిలిచారు. అల్లు అర్జున్, సమంత అక్కినేని తదితరులు పెళ్లికి హాజరయ్యారు. తెలుపు రంగు దుస్తుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పెళ్ళికి హాజరయ్యారు.
వధూవరుల కుటుంబాలు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఈ పెళ్లి నిర్వహించింది. పెళ్లికి రాని వారి కోసం వీఆర్ టెక్నాలజీ ద్వారా పెళ్లిని లైవ్ లో చూసిన అనుభూతి కల్పించారు. తమ సన్నిహితులకు వీఆర్ సెట్ లను అందించారు.
వీఆర్ సెట్ ను ఉపయోగించి రానా పెళ్లిని చూసిన వాళ్లలో హీరో నాని కూడా ఉన్నారు. "ఓ దిగ్గజ బ్రహ్మచారి(ఐకానిక్ బ్యాచిలర్) కథ ఎలా ముగిసిపోతోందో చూస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ బాబాయ్!" అని అన్నారు నాని. ఈ టెక్నాలజీ ఏంటో.. అంటూ వీఆర్ సెట్ లో రానా పెళ్లిని చూస్తున్న ఫోటోను పోస్టు చేశాడు నాని.
పెళ్లి చేసుకున్న రానాకు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో విషెస్ చెబుతూ వస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రానా దగ్గుబాటి, మిహీక బజాజ్ లకు శుభాకాంక్షలు చెబుతూ వారిద్దరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేశారు.
గత కొద్దిరోజులుగా హైదరాబాద్ లో వర్షం పడుతూ ఉండడంతో వేదికను కూడా వాటర్ ప్రూఫ్ గా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.