'ఈనాడు' నుండి త‌ప్పుకున్న‌ రామోజీరావు.. ఆ భ‌యంతోనేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Dec 2019 8:29 AM GMT
ఈనాడు నుండి త‌ప్పుకున్న‌ రామోజీరావు.. ఆ భ‌యంతోనేనా..?

రామోజీ రావు.. తెలుగు పత్రికా పాఠ‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈనాడు అధిప‌తి. దాదాపు ఐదు ద‌శాబ్దాలుగా త‌న శ్ర‌మ‌తో, ఆలోచ‌న‌లతో, వ్యూహాల‌తో ఈనాడు ప‌త్రిక‌ను అగ్ర‌భాగాన నిలిపిన మీడియా మొగ‌ల్. అయితే.. రామోజీరావు అనూహ్యంగా ఈనాడు ఎడిట‌ర్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న ఈనాడు ఎడిట‌ర్ హోదాలో ఉన్నారు. మాములుగా అయితే జ‌ర్న‌లిస్టులే ప‌త్రిక‌ల‌కు ఎడిట‌ర్లుగా ఉంటారు. కానీ.. రామోజీరావు జ‌ర్న‌లిస్టు కాక‌పోయినా ఎడిట‌ర్‌గా ఉన్నారు.

రామోజీరావు.. ఆయ‌న స్థానంలో ద‌శాబ్దాలుగా ఈనాడులో ప‌నిచేసిన‌ ఇద్ద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌కు ఎడిట‌ర్‌లుగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎడిష‌న్‌కు ఎడిట‌ర్‌గా ఎం.నాగేశ్వ‌ర‌రావును, తెలంగాణ ఎడిష‌న్‌కు డీఎన్ ప్ర‌సాద్‌ను నియ‌మించారు. వీరివురూ ఈనాడు ద్వారానే జ‌ర్న‌లిజంలోకి ఎంట్రీ ఇచ్చారు.

రామోజీరావు.. ఈనాడు ఎడిట‌ర్ బాధ్య‌త‌ల నుంచి ఒక్క‌సారిగా ఎందుకు త‌ప్పుకున్నార‌నేది మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ విఝ‌య‌మై రెండు వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వ‌య‌స్సు పైబ‌డిన రీత్యా ఆయ‌న ఎడిట‌ర్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నార‌నే వాద‌న వినిపిస్తున్నా.. మ‌రో వాద‌న కూడా బ‌లంగా వినిపిస్తుంది.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఇటీవ‌ల తీసుకొచ్చిన‌ 2430 జీవో కార‌ణంగానే రామోజీరావు ఎడిట‌ర్‌గా త‌ప్పుకున్నార‌నే వార్త కూడా ప్ర‌చారంలో ఉంది. జ‌గ‌న్ కొత్త జీవో ప్ర‌కారం.. ఉద్దేశ‌పూర్వ‌కంగా ఏదైనా త‌ప్పుడు వార్త రాస్తే స‌ద‌రు ప‌త్రిక‌పై, ఎడిట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకునేలా ఈ జోవోను ఏపీ ప్ర‌భుత్వం అమ‌లులోకి తెచ్చింది.

ఈనాడు టీడీపీకి అనుకూలంగా ఉండే ప‌త్రిక‌. జ‌గ‌న్ కూడా ఈనాడును ప‌దేప‌దే విమ‌ర్శిస్తుంటారు. ఈ నేప‌థ్యంలో కొత్త జీవో ప్ర‌కారం.. అవ‌కాశం దొరికితే ఈనాడుపై, ఎడిట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటుంది. అందుకే, ఈ వ‌య‌స్సులో ఎడిట‌ర్ హోదాలో ఉంటూ రిస్క్ తీసుకోవ‌డం ఎందుక‌నే ఆలోచ‌న‌తోనే.. రామోజీరావు ఎడిట‌ర్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుని.. ఫౌండ‌ర్‌గా మాత్ర‌మే కొన‌సాగ‌నున్నార‌నే వాద‌న వినిపిస్తుంది.

Next Story