ముఖ్యాంశాలు

  • సంప్రదాయ భారతీయ ఆహార్యంలో అభిజీత్ బెనర్జీ
  • పట్టుచీర కట్టుకుని ఫంక్షన్ కు హాజరైన ఈస్టర్ ఢప్లో
  • కాన్సర్ట్ హాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అభిజీత్ దంపతులు
  • అభిజీత్ దంపతుల ఆహార్యానికి ప్రశంశల వెల్లువ
  • సంప్రదాయ ఆధునిక రీతుల మేళవింపుగా డిజైనర్ల ప్రశంస
  • అభిజీత్ దంపతులకు దుస్తులను డిజైన్ చేసిన శబరీ దత్తా
  • శబరీ దత్తా క్రియేటివిటీని ప్రశంసించిన భారతీయ డిజైనర్లు

“ఏ దేశమేగినా, ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము” అన్న మాటల్ని విశ్వవిఖ్యాత భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త అభిజీత్ బెనర్జీ తు.చ తప్పకుండా పాటించారు.

2019 నోబెల్ పురస్కారాన్ని అందుకునేందుకు తన అర్ధాంగితో కలసి స్వీడన్ కు వెళ్లిన ఆయన భారతీయ సంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకర్షించారు. ఆయన మాత్రమే కాక అర్ధాంగి ఈస్థర్ డఫ్లో కూడా భర్తను అనుసరించి పట్టుచీరను కట్టుకుని మన జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు.

భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త

అభిజీత్ బెనర్జీ. భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త. 2019 నోబెల్ పురస్కార గ్రహీత. ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై ప్రయోగాత్మక పరిశీలనతో అద్భుతాలు సాధించిన ధీశాలి. 2019 నోబెల్ పురస్కారాన్ని అందుకునేందుకు ఆయన స్వీడన్ కు వెళ్లారు.

స్టాక్ హోమ్ లోని పురస్కార వేదిక కాన్సర్ట్ హాల్లోకి ఆయన అడుగుపెట్టగానే కరతాళ ధ్వనులు మిన్నంటాయి. పట్టు పంచె కట్టుకుని, దానిపై నల్లటి కోటును వేసుకుని హుందాగా ఆయన ఆ హాల్లోకి అడుగుపెట్టగానే సంప్రదాయ రీతుల్ని గౌరవించే సగటు భారతీయుడి ఆహార్యం స్పష్టంగా కనిపించింది.

ఆ ఆహార్యం ఆయన గౌరవాన్ని మాత్రమే కాక ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణాలను అణువణువునా నింపుకున్న బిడ్డల్ని ఎందరినో కన్న భరతమాత గౌరవాన్నికూడా ఇనుమడింపజేసింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అభిజీత్ అర్థాంగి, తనతోపాటుగా నోబెల్ పురస్కారాన్ని పంచుకున్న ఈస్థర్ డఫ్లోకూడా పట్టుచీర కట్టుకుని పదహారణాల తెలుగు వనితలా ధీర గంభీరంగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ఫ్యాషన్ డిజైనర్ శబరీ దత్తా ఈ దంపతులకు ప్రత్యేకంగా ఈ దుస్తులను డిజైన్ చేశారు. బెంగాలీ సంప్రదాయానికి విదేశీ సంప్రదాయాన్నికూడా జోడించి అభిజీత్ బెనర్జీకి తాను ఇలా పట్టుపంచె, లాల్చీమీద నల్లటి కోటు వేసుకునే విధంగా దుస్తులను రూపొందించానని డిజైనర్ చెప్పారు.

భారతీయ వనితలా కనిపించారు

ఇక ఈస్థర్ డఫ్లో విషయానికి వస్తే ఆమె అచ్చంగా భారతీయ వనితలా కనిపించాలని భావించారు. అందుకే డిజైనర్ ఆమెకు పూర్తి స్థాయిలో ఆమె భారతీయ వనితలా కనిపించే దుస్తులను ఎంపిక చేశారు. ఈస్థర్ డఫ్లో నీలిరంగు పట్టుచీర కట్టుకుని హుందాగా భారతీయ ఆహర్యంలో కనిపించడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

నోబల్ పురస్కార వేదికపై మొట్టమొదటిసారి ఇలా సంప్రదాయ దుస్తులను ధరించిన జంటగా అభిజీత్ బెనర్జీ, ఈస్థర్ డఫ్లో కొత్త సంప్రదాయానికి నాందీ పలికారు. ఇప్పటివరకూ ఈ వేదికపై పురస్కారాన్ని అందుకునేందుకు వచ్చిన మగవారంతా పూర్తిగా త్రీ పీస్ సూట్ తో, మహిళామణులు పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ లుక్ తో కనిపించేవారు. మొదటిసారిగా అభిజీత్ బెనర్జీ దంపతులు ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి భారతీయ ఆహార్యంలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

సంప్రదాయ ధోతీని ధరించిన అభిజీత్ పైన నల్లకోటుతో, కాళ్లకు నల్ల బూట్లతో హుందాతనానికి సరికొత్త చిరునామాగా నిలిచారని ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్లు ప్రశంశల వర్షాన్ని కురిపించారు. అతి సాధారణంగా, అత్యంత హుందాగా ఉండేలా అభిజీత్ దంపతుల ఆహార్యం కనిపించిందని డిజైనర్లు శబరీ దత్తా ఆలోచనలకు ప్రశంశలు అందించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.