రామోజీ, కన్నాల మీటింగ్ అంతరార్థం ఏమిటి?

By Newsmeter.Network  Published on  24 Dec 2019 4:41 AM GMT
రామోజీ, కన్నాల మీటింగ్ అంతరార్థం ఏమిటి?

రామోజీ రావు ఈనాడు బాధ్యతల నుంచి తప్పుకుని వానప్రస్థానికి వెళ్లిపోయారని భావించే వారికి ఒక షాక్. ఆయన రోజువారీ పనుల నుంచి పక్కకు వెళ్లారే తప్ప రాజకీయాలను ప్రభావితం చేసే స్థితి నుంచి దూరం కాలేదు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల విషయంలో ఆయన ఇంకా క్రియాశీలకంగానే ఉన్నారు.

దీనికి తాజా ఉదాహరణ ఇటీవల ఆయనకు, ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు మధ్య జరిగిన సమావేశం. ఈ సమావేశం ఫిలింసిటీలోని రామోజీ కార్యాలయంలో జరిగింది. ఒక మహాసింహాసనం లాంటి కుర్చీపై రామోజీ కూర్చోగా, ఒక సాధారణ సోఫాపై కన్నా వారు కూర్చున్నారు. ఇద్దరూ కలిస్తే సుఖీభవ ప్రోగ్రాం గురించో లేక అభిరుచి వంటకాల గురించో మాట్లాడుకుంటారనుకుంటే పొరబాటే. ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడుకుంటారు. అందునా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటారు.

రామోజీ రావు బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్నారా? వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను ఎదుర్కొనే విషయంలో ఆలోచిస్తున్నారా? లేక తెలుగుదేశం రాజకీయ భవిష్యత్తును మెరుగుపరిచేందుకు స్వయంగా పెద్దాయనే పూనుకున్నారా? లేక ఆయన కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాల్సిన ప్రతిపాదనల విషయంలో కన్నా లక్ష్మీనారాయణతో చర్చలు జరుపుతున్నారా? ఇద్దరూ ఏం చర్చించారో ఏమీ బయటకు రాలేదు. కానీ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫోటో బయటకు వచ్చిందంటే పెద్దాయన ఈ ఫోటోకు ప్రచారం రావాలని కోరుకున్నట్టే కదా!!

ప్రస్తుతానికి వివరాలు బయటకి రాకపోయినా త్వరలో బయటకు వస్తాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఏదేమైనా ఊరక కావు ఇలాంటి మీటింగులు....!!!

Next Story