రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్టు ఏంటో తెలుసా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Aug 2020 10:07 AM GMT
రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్టు ఏంటో తెలుసా.?

ప్రతి నటుడికీ ఫలానా పాత్ర చేయలని లేదా ఫలానా జానర్లో నటించాలని లేదా ఓ నిజ జీవిత కథలో నటించాలని.. ఇలా కొన్ని కలలుంటాయి. రామ్ చరణ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అతడికి ఒక జానర్లో నటించాలన్న కోరిక కెరీర్ ఆరంభం నుంచి ఉందట. కానీ ఇప్పటిదాకా అది నెరవేరలేదని.. కచ్చితంగా ఆ జానర్లో నటిస్తానని అంటున్నాడు చరణ్. చిరు తనయుడికి అంతగా నచ్చిన జానర్.. స్పోర్ట్స్ డ్రామా అట. ఈ జానర్లో నటించే అవకాశం అందినట్లే అంది చేజారిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్ వెల్లడించాడు.

చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథలో నటించి తన కల నెరవేర్చుకున్నారు.. మరి మీకిలాంటి డ్రీమ్ ప్రాజెక్టు ఏదైనా ఉందా అని ఈ ఇంటర్వ్యూలో చరణ్‌ను అడిగితే.. ‘‘నాకు ఒక మంచి స్పోర్ట్స్ డ్రామా చేయాలని ఉంది. నిజానికి ఆర్.బి.చౌదరి గారి నిర్మాణంలో నేను ‘మెరుపు’ అనే స్పోర్ట్స్ సబ్జెక్ట్‌తో సినిమా మొదలుపెట్టా. అనుకోని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రాజెక్టు రాలేదు. దాని కోసమే చూస్తున్నా’’ అని చరణ్ చెప్పాడు. ఒకప్పటి తమిళ స్టార్ డైరెక్టర్ ధరణి దర్శకత్వంలో చరణ్, కాజల్ జంటగా ‘మెరుపు’ సినిమా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. కానీ కారణాలేంటో తెలియదు కానీ ఆ సినిమా ఆగిపోయింది. దాని స్థానంలోనే చరణ్ ‘ఎవడు’ చేశాడు.

ఇక ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు, ‘ఆచార్య’లో ప్రత్యేక పాత్రల గురించి చరణ్ మాట్లాడుతూ.. ‘‘అల్లూరి పాత్ర చేయడం నా అదృష్టం అనేది చిన్న పదం. దానికి మించి మాటల్లో చెప్పలేని అనుభూతి అది. చాలా జాగ్రత్తగా ఆ పాత్రను తెరపై చూపిస్తున్నారు రాజమౌళి. కథకు తగ్గట్లు నా పాత్ర కొత్తగా ఉంటుంది. అదంతా రాజమౌళి విజువలైజేషన్. స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన సన్నివేశాలన్నీ ఆయన పర్సెప్షణ్లో కొత్తగా ఉంటాయి. ఇక నాన్న గారితో ఇంతకుముందు మూడు సినిమాల్లో కలిసి కాసేపు కనిపించా. ఈసారి మా అమ్మ కోరికను నెరవేరుస్తూ.. ఇద్దరం కలిసి పూర్తి స్థాయిలో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉంది’’ అని చరణ్ అన్నాడు.

Next Story