రాజీవ్ గాంధీకి తెలీకుండానే ఆ పని చేశారా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 19 Aug 2020 11:45 AM GMTకాలం దెబ్బకు చరిత్రగా మారిపోయే అంశాలు.. కొన్నిసార్లు అనూహ్యంగా తెర మీదకు వస్తుంటాయి. అలాంటివి విన్నప్పుడు.. నిజంగానే అలా జరిగి ఉంటుందా? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా అలాంటి ఉదంతాన్ని చెప్పుకొచ్చారు మాజీ ఐఏఎస్ అధికారి వజాహత్ హబీబుల్లా. ఇంతకీ ఈయన ప్రత్యేకత ఏమంటారా? ఇప్పుడైతే బాగా పెద్ద వయస్కులు అయ్యారుకానీ.. కొన్నేళ్ల క్రితం అంటే.. దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ వ్యవహరించిన సమయంలో.. ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయన కీలక భూమిక పోషించారు.
ఆ సందర్భంగా జరిగిన పలు సంఘటలకు సంబంధించి తాజాగా ఆయనో పుస్తకాన్ని రూపొందించారు. 'ఇయర్స్ విత్ రాజీవ్ గాంధీ త్రియంఫ్ అండ్ ట్రాజెడీ' అన్న పుస్తకాన్నిరచించారు. దీన్ని ఈ దసరాకు మార్కెట్లోకి విడుదల కానుంది. జమ్ముకశ్మీర్ కుచెందిన ఈ కశ్మీర్ కేడర్ అధికారి.. దివంగత మాజీ ప్రధానికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు.
ఇక.. పుస్తకం విషయానికి వస్తే.. ఇందులో పలు ఆసక్తికర అంశాల్ని పేర్కొన్నారు. 1986లో గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధాని రాజీవ్ తో పాటు తాను కూడా ఆయన ప్రయాణిస్తున్న బోయింగ్ లో ప్రయాణించిన వైనాన్ని పేర్కొన్నారు. అప్పట్లో అయోధ్య అంశం హాట్ హాట్ గా ఉండేది. అయోధ్య రామ మందిరం.. బాబ్రీ మసీదును తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం గురించి రాజీవ్ కు సమాచారమే లేదని పేర్కొన్నారు.
ఆ నిర్మాణం తెరవటంలో మీ పాత్ర ఉందా? అని అప్పటి ప్రధాని రాజీవ్ ను తాను అడిగానని.. అందుకు తాను జోక్యం చేసుకోలేదన్నారు. ఉత్తర్వులు వచ్చి అమలు చేసే వరకు తనకేమీ తెలీదని రాజీవ్ తనతో చెప్పినట్ులగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాను.. ‘‘సార్.. మీరు ప్రధాని’’ అని పేర్కొంటే.. తాను ప్రధానినేనని.. కానీ ఆ అంశం మీద తనకు సమాచారం లేదన్నారు. ఆలయాన్ని తెరిచేపని నాడు కేంద్రమంత్రిగా ఉన్న అరుణ్ నెహ్రు ఏమైనా చేశారా? అన్న సందేహానికి నిర్దారించుకోవాలని పేర్కొన్నట్లు చెప్పారు. ఒకవేళ.. అదే నిజమైతే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని రాజీవ్ పేర్కొన్నట్లు చెప్పారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరఅంశాలు పుస్తకంలో ఉంటాయని చెబుతున్నారు.