రాజస్థాన్ హైడ్రామా : కాంగ్రెస్ చేజేతులా చేసుకుంటోందా.. బీజేపీ ఆపరేషనా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 July 2020 8:28 PM IST
రాజస్థాన్ హైడ్రామా : కాంగ్రెస్ చేజేతులా చేసుకుంటోందా.. బీజేపీ ఆపరేషనా?

రాజస్థాన్ రాజకీయం అటు మధ్యప్రదేశ్, ఇటు కర్ణాటక పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాలాగే రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ముఖ్యమంత్రి గెహ్లాట్‌పై తిరుగుబాటు జెండా ఎగరేయడం, ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌కు తరలించడం రెండు రాష్ట్రాల నాటి పరిస్థితుల్ని కళ్ళముందు ఉంచుతున్నాయి. ఈ సంక్షోభం నెపం బీజేపీ పైకి నెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ సొంత పార్టీలో ఇంతటి తీవ్రంగా అంతర్యుద్ధం సాగుతుంటే కమలం పార్టీ పైకి నెట్టి తప్పించుకోవడానికి ఆ పార్టీకి అవకాశం కనిపించడం లేదు. కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఉపయోగించవచ్చు. అది పక్కన పెడితే మధ్యప్రదేశ్‌లో సింధియా, రాజస్థాన్‌లో పైలట్.. పార్టీలు అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేశారని, కానీ వారిని కాంగ్రెస్ పక్కన పెట్టడంతో వారు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి లోనయ్యారని, దీనిని బీజేపీ అందిపుచ్చుకోవాలని చూస్తోందనే విషయం గుర్తించాలని సూచిస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో సచిన్ పైలట్ పాత్ర ఎంతో ఉంది. కానీ తీరా సీఎం పీఠంపై గెహ్లాట్ కూర్చున్నారు. పార్టీ అధిష్టానం సచిన్‌ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. సీఎం, డిప్యూటీ సీఎం.. ఇద్దరు ఎవరికి వారే పైచేయి కోసం అంతర్గతంగా పావులు కదుపుతూనే ఉన్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోందని రాజకీయ నిపుణులు మొదటి నుండి భావిస్తున్నారు. 2018లో అభ్యర్థుల ఎంపిక, అధిష్టానం మాట విని సీఎం పదవిని వదులుకున్నప్పటికీ కీలక శాఖలు కూడా సచిన్ లేదా ఆయన వర్గానికి రాలేదు. 2019లో స్వయంగా సీఎం తనయుడు ఎన్నికల్లో ఓడిపోయారు.

అప్పటికే రగిలిపోతున్న సచిన్ పైలట్‌కు గత నెల 13వ తేదీన రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ అంశం ఆగ్రహాన్ని తెప్పించింది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన దర్యాఫ్తు అంతా సచిన్ పైలట్ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని సాగుతోందనే వాదనలు ఉన్నాయి. అంతేకాదు, ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించాలని చూస్తున్నారని యువనేత వర్గం ఆరోపణ. గెహ్లాట్ తీరుపై సచిన్ పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేశారు. నిన్న ఢిల్లీకి వచ్చారు. సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ జరగాల్సి ఉన్నా డుమ్మా కొట్టారు. బీజేపీలో చేరుతారనే వార్తలు కొట్టి పారేశారు. దీంతో సొంత పార్టీ పెడతారని ప్రచారం సాగింది. కాంగ్రెస్ అతనిని బుజ్జగించే కార్యక్రమం చేపట్టింది. అయితే ముందస్తుగా ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించింది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఆశావహుల్లో యువనేతలు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్‌ల పేర్లు వినిపించాయి. ఎందుకంటే గెలుపులో వారి పాత్ర అధికం. కానీ వృద్ధ నేతలకు సీఎం పదవి ఇచ్చారు. సింధియా బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ కుప్పకూలింది. దీని నుండి కాంగ్రెస్ పాఠాలు నేర్చుకున్నట్లుగా లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

అప్పటికే సచిన్ పైలట్ తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ, ఆయన ఫిర్యాదులు చేసినప్పటికీ అధిష్టానం నుండి ఆశించిన మద్దతు రాలేదని అంటున్నారు. పైగా ఉన్న డిప్యూటీ సీఎం పదవి నుండి కూడా తప్పించాలని ముఖ్యమంత్రి గెహ్లాట్ ప్రయత్నాలు చేస్తుంటే.. దానికి అధిష్టానం అడ్డుకట్ట వేయకపోవడమే ప్రస్తుత పరిణామాలకు దారి తీశాయని అంటున్నారు. సచిన్‌కు భరోసా ఇవ్వడంలో పెయిలయిందని చెబుతున్నారు. సచిన్ బీజేపీ వైపు వెళ్లాలని భావించినప్పటికీ సీఎం పదవికి హామీ రాకపోవడంతోనే వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. పార్టీలోని కీలక నేతల మధ్య తారాస్థాయిలో విభేదాలు ఉండటం, వాటిని అధిష్టానం పరిష్కరించలేకపోవడం. ద్వారా ఎదుటి పార్టీకి తామంతట తామే చేయిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఎలాగూ బీజేపీలో చేరడం లేదని ప్రకటించారు. కొత్త పార్టీ పెడతారా? పార్టీ బుజ్జగింపులకు చల్లబడతారా? అనేది వేచి చూడాలి.

Next Story