వికాస్ దూబే ఎన్‌కౌంటర్ : ఈ అయిదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 July 2020 1:20 PM GMT
వికాస్ దూబే ఎన్‌కౌంటర్ : ఈ అయిదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదే..!

వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఎంతో మంది నాయకుల పేర్లు బయటకు వస్తాయనే వికాస్ దూబేను ఎన్‌కౌంటర్ చేశారని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఎన్‌కౌంటర్ చేశారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కారు బోల్తా పడలేదని.. అతడి ద్వారా రహస్యాలు బయటపడితే ప్రభుత్వం బోల్తా పడే అవకాశం ఉండడంతో అలా జరగకుండా చర్యలు తీసుకున్నారని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ ట్వీట్ చేశారు.నేరస్తుడు చచ్చిపోయాడు సరే.. మరి అతడు చేసిన నేరాలు, అందుకు సహకరించిన వారి సంగతేంటి? అంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నిలదీశారు. కాగా, దీనిపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. 'చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు కదా' అని ట్వీట్ చేశారు.వికాస్ దూబే ఎన్ కౌంటర్ పై అయిదు ప్రశ్నలు అందరినీ వెంటాడుతూ ఉన్నాయి.

వికాస్ దూబే కారును మార్చారా..? ఉదయం నాలుగు గంటల సమయంలో టోల్ ప్లాజా వద్ద రికార్డు అయిన వీడియోలో వేరే కార్ కనిపించింది. ఉదయం తిరగబడిందంటూ వీడియోలో చూపించింది వేరే కార్ అని తెలుస్తోంది.

పోలీసు కాన్వాయ్ వెంట వస్తున్న మీడియా వాహనాలను ఎన్ కౌంటర్ జరిగే ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆపి వేశారు.

అక్కడ ఉన్న స్థానికులు తాము గన్ షాట్స్ విన్నామని చెప్పారు. అంతేకానీ యాక్సిడెంట్ జరిగిన విషయం తమకు తెలీదని అన్నారు. అంతేకాకుండా పోలీసులు స్థానికులను అక్కడి నుండి వెళ్లిపొమ్మని కోరారు.

60 కేసుల్లో నిందితుడు, మర్డర్ చేశాడన్న అభియోగాలు. అయినా కూడా చేతికి బేడీలు వేయకపోవడం ప్రశ్నార్థకంగా మిగిలింది..? కారు తిరగబడినప్పటికీ వికాస్ దూబే తుపాకీ లాక్కుని, కారు ఎక్కి, పారిపోయాడన్న ప్రశ్న కూడా అందరినీ వెంటాడుతోంది.

కారు యాక్సిడెంట్ జరిగిన చోట ఎటువంటి బ్యారియర్లు కనిపించలేదు. అటు వైపుగా పొలాలలోకి వెళ్ళడానికి రోడ్డు కూడా ఉంది.

కాన్పూర్ ఆసుపత్రిలో వికాస్ దూబే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రక్రియను వీడియోలో బంధించారు. అతడి మృతదేహంలో నాలుగు బుల్లెట్ గాయాలు ఉన్నట్టు గుర్తించారు. వికాస్ దూబే మృతదేహానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా.. అతడికి కరోనా సోకలేదని తేలింది.

వికాస్‌ దూబేను శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో దూబే హతమైనట్లు యూపీ పోలీసులు అధికారికంగా వెల్లడించారు. గురువారం ఉజ్జయిని మహాంకాళి దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లగా, పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వికాస్‌ దూబేను కాన్పూర్‌కు వాహనంలో తరలిస్తుండగా, వారి వాహనం బోల్తాపడింది. ఎనిమిది మంది పోలీసులను వికాస్ గ్యాంగ్ హత్య చేయడంతో పోలీసులు గడచిన ఐదు రోజుల్లో వికాస్ గ్యాంగ్ లోని పలువురిని కాల్చి చంపారు. ఇప్పుడు వికాస్ దూబేను కూడా ఎన్ కౌంటర్ చేయడం సంచలనమైంది.

Next Story
Share it