ధోనీ బాటలోనే రైనా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 9:41 PM IST
ధోనీ బాటలోనే రైనా..!

భార‌త మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీ బాటలోనే మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా నడిచాడు. ధోని రిటైర్మెంట్‌ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే సురేశ్‌ రైనా.. తాను కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ‘ధోనీ నీతో కలిసి ఆడడం ఓ మధురానుభూతి.. ఈ ప్రయాణంలో నేనూ మీతో చేరాలని నిర్ణయించున్నా. జైహింద్‌’’ అంటూ ధోనీతో కలిసి ఉన్న ఫోటోను జతచేసి రైనా తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

2005 జులైలో శ్రీలంకపై క్రికెట్‌ అరంగేట్రం చేసిన రైనా.. 2010 జులైలో శ్రీలంకపై తొలి టెస్ట్‌ మ్యాచ్ ఆడాడు. రైనా కెరీర్‌లో 266 వన్డేలు ఆడి 5,615 పరుగులు చేశాడు. అత్యధికంగా 116 పరుగులు చేసిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మన్‌ మొత్తం ఐదు సెంచరీలు, 36 అర్ధశతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 36 వికెట్లు కూడా తీశాడు. 2010లో టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టిన రైనా 18 టెస్టుల్లో 768 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది.

సురేష్‌ రైనా.. ప్రస్తుతం ధోనీతో కలిసి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఇలా ఒకే జట్టులో ఆడుతున్న ఇద్దరు బ్యాట్స్‌మన్లు ఒకేరోజు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం క్రీడాభిమానుల‌ను ఒకింత‌ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

Next Story