రెండు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

By సుభాష్  Published on  10 Sep 2020 7:44 AM GMT
రెండు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలతోపాటు ప్రాజెక్టులు సైతం పూర్తిగా నిండిపోయి నిండుకుండలా మారిపోయాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని రాష్ట్రాలో తీవ్ర నష్టం కూడా వాటిల్లింది. ఇళ్లన్ని నేలమట్టమై ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురియనున్నాయి.

గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ మహారాష్ట్ర, ఉత్తర కేరళ తీర ప్రాంతాల మధ్య అల్పపీడనం ఏర్పడిందని, ఈ కారణంగా గాలి దిశ, వేగంలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపింది. దీని ప్రభావం దేశం అంతటా ఎంతో కొంత ఉండే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు కర్ణాటక తీరం - అరేబియా సముద్రం మీద తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఇక కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, అస్నాం, మేఘాలయలలో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే సెప్టెంబర్‌ 11 నుంచి నెల చివరి వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ రోజు, రేపు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 13వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వీటి ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనావేసింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.

Next Story