17 నుంచి 24 వరకు బతుకమ్మ సంబురాలు

By సుభాష్  Published on  10 Sep 2020 7:09 AM GMT
17 నుంచి 24 వరకు బతుకమ్మ సంబురాలు

తెలంగాణలో ముఖ్యమైన పండగల్లో బతుకమ్మ ఒకటి. పువ్వులను పూజించడమే బతుకమ్మ పండగ విశిష్టత. చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఆడ పడుచులందరూ కలిసి ఆడుకునే పండగ బతుకమ్మ. ప్రతి ఏడాది బతుకమ్మ పండగ వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడుచులు ఎక్కడున్న వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుంటారు. ఆనందోత్సహౄలతో పండగ జరుపుకొంటారు. తిరొక్క పూలతో రంగు రంగుల బతుకమ్మలను రోజుకో తీరుతో ఎంగిలిపూల బతుకమ్మ, అట్ల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ జరుపుకొంటారు. ఈ ఏడాది అధిక ఆశ్వీయుజ మాసం వచ్చినందుకు బతుకమ్మ పండగపై హిందువుల్లో కొంత సందిగ్ధం నెలకొంది. ఎంగిలిపూల బతుకమ్మ, అట్ల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి స్పష్టతనిచ్చింది. బతుకమ్మ పండగ నేపథ్యంలో బుధవారం పంచాంగకర్తలు, పురోహితులు, పండితులు సమావేశమై పండగపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

ఈనెల 17వ తేదీ గురువారం భాద్రపద బహుళ అమావాస్య ఉన్నందున అదే రోజున ప్రతి ఏడాది లాగే పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడం, దాంతో పాటుగానే ప్రతిసారి ఆనవాయితీగా వస్తున్న ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని సూచించారు. అందుకు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాంగకర్తలు, పురోహితులు తెలిపారు. అలాగే అక్టోబర్‌ 17వ తేదీ నుంచి బతుకమ్మ పేర్చి అప్పటి నుంచి 24వ తేదీ దుర్గష్టమి వరకు బతుకమ్మను ఎనిమిది రోజుల పాటు పేర్చి పూజించి ఆడిపాడి నిమజ్జనం చేయాలని సూచించారు. పెద్దల అమావాస్య నాడు పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడంతో పాటు ఎంగిలిపూల బతుకమ్మ నిర్వహించడం మన ఆచారమని పేర్కొన్నారు. ఇక రంగురంగుల పూలతో ఊరువాడ బతుకమ్మలతో సందడి మొదలు కానుంది. ఈ పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అక్కడక్కడ జరుపుకొంటారు. ఇదిలా ఉంటే ఈ సారి కరోనా నేపథ్యంలో బతుకమ్మ సంబురాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా.? లేదా..? అనేది ఆడపడుచుల్లో తలెత్తుతున్న ప్రశ్న.

Next Story