రాహుల్ 20 లక్షల మాట చిన్నపోయే మాట చెప్పిన కేంద్రం
By సుభాష్ Published on 18 July 2020 5:08 AM GMTచిన్నగీతకు మించి పెద్ద గీత గీయటం ఎంత సులువో.. ఆ పెద్ద గీతను చిన్నబోయేలా చేయటం ఎలానో చేతల్లో చూపించి షాకిచ్చింది కేంద్రంలోని మోడీ సర్కారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పది లక్షలు క్రాస్ అవుతున్న వేళ.. మోడీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను చెప్పినట్లే పది లక్షల కేసుల ఫిగర్ దాటుతున్నట్లుగా చెప్పారు. అక్కడితో ఆగని ఆయన.. ఇదే తీరులో సాగితే ఆగస్టు మూడో వారంలో ఇరవై లక్షల కేసుల్ని దాటేయటం ఖాయమని హెచ్చరించారు.
రాహుల్ మాటలు వైరల్ అయ్యే వేళలో.. కేంద్రమే ఒక అడుగు ముందుకు వేసింది. భవిష్యత్తు లెక్కలు ఇలా ఉంటాయి సుమా.. అంటూ తాను సెప్టెంబరునాటికి భారత్ లో కేసుల పరిస్థితి ఏమిటన్న విషయాన్ని చెప్పేస్తూ.. అందరూ ఆశ్చర్యపోయేలా లెక్కల్ని వెల్లడించింది. రానున్న ఒకటిన్నర నెలల్లో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టీం పరిస్థితిని చెప్పుకొచ్చింది. సదరు సంస్థ లెక్క ప్రకారం సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి ప్రస్తుతం ఉన్న పాజిటివ్ పేషెంట్ల సంఖ్య మూడు రెట్లకు పెరిగే అవకాశం ఉందని తేల్చారు.
ప్రస్తుతం పది లక్షల కేసుల్ని దాటేసిన దేశం.. సెప్టెంబరు ఒకటి నాటికి 35 లక్షలకు చేరతాయని స్పష్టం చేసింది. పేరుకు పది లక్షలే కానీ.. దేశంలో యాక్టివ్ గా ఉన్న కేసులు కేవలం 3.42లక్షలు మాత్రమేనని చెప్పింది. దాదాపు 63.33 శాతం రికవరీ రేటు భారత్ లో నమోదైందని చెప్పిన సదరు సంస్థ.. ఇప్పటికి 6.35లక్షల మంది కోలుకున్నట్లు చెప్పింది. రానున్న రోజుల్లో భారీ ఎత్తున పెరగనున్న కేసుల గురించి ప్రస్తావిస్తూ.. అదేం పెద్ద విషయం కాదన్న రీతిలో వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచంలో రెండో అతి పెద్ద జనాభా ఉన్న భారత్ లో 1.35బిలియన్ల ప్రజలు ఉన్నారని.. అలాంటి దేశంలో మిలియన్ జనాభాకు 727.4 కరోనా కేసులు నమోదైనట్లుగా పేర్కొంది. ఇప్పటివరకూ కరోనా కారణంగా పాతిక వేల మంది మరణించినట్లు వెల్లడించింది. తాజా గణాంకాలతో దేశ ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసినట్లుగా కనిపిస్తోంది. పది లక్షలకే వామ్మో అనుకునే వారికి రానున్న రోజుల్లో 35 లక్షలకేసులు చెప్పటం ద్వారా.. ఇప్పటి అంకెల గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చెప్పినట్లుగా కనిపించక మానదు. ఇప్పటికే కేసుల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న రాహుల్ మాటలు చిన్నబోయేలా తాజా గణాంకాలు ఉన్నాయని చెప్పాలి. 20లక్షల కేసుల దగ్గరే ఉన్న రాహుల్.. తాజాగా చేసిన 35లక్షల కేసుల మాటకేమంటారో?