మనది రాచరిక వ్యవస్థ కాదు.. సుప్రీం తీర్పును గౌరవిద్దాం : రఘురామకృష్ణరాజు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 24 July 2020 9:26 AM

మనది రాచరిక వ్యవస్థ కాదు.. సుప్రీం తీర్పును గౌరవిద్దాం : రఘురామకృష్ణరాజు

ముఖ్యమంత్రి జగన్‌ సుప్రీం కోర్టు నిర్ణయాన్ని గౌరవించి నిమ్మగడ్డ రమేష్‌ కమార్‌ను ఎస్‌ఈసీగా తిరిగి నియమించాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. న్యాయ వ్యవస్థను గౌరవించని ప్రభుత్వ వ్యవస్థకు పుల్‌స్టాప్‌ పెడదామని, కోర్పు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ని తిరిగి నియమిస్తే తప్పేంటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ రమేష్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయం.. సరైన నిర్ణయమని ప్రజలు గమనించారని గుర్తు చేశారు. కరోనా మహమ్మారి నుంచి ఆ నిర్ణయం ప్రజలను కాపాడిందని చెప్పారు.

రాజ్యాంగానికి, కోర్టులకు వ్యతిరేకంగా వెళ్లే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మనది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య దేశమన్నారు. న్యాయ వ్యవస్థలను, కోర్టులను గౌరవిద్దామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడమే తన తప్పైపోయిందని అన్నారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం… రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి వచ్చి వేడుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా భారీ మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వం మనదన్నారు. పక్కనున్న వారి మాటలు విని సీఎం జగన్‌.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవద్దని సూచించారు. రాజ్యంగం పట్ల కనిసం అవగాహన లేని కొద్ది మంది నా మీద ఫిర్యాదు చేస్తే.. ఏమౌతుంది.. ఏమీ కాదని చెప్పారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతు నొక్కేస్తారా అని ప్రశ్నించారు.

Next Story