సామాజిక మాధ్యమాల్లో పలువురు రాముడి పేరు మీద కరెన్సీ ఉందంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. లోవా, అమెరికా, నెదర్లాండ్స్ దేశాల్లో దీన్ని వాడుతూ ఉన్నారని.. ప్రపంచంలోనే ఖరీదైన కరెన్సీ ఇదంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.

పలువురు సోషల్ మీడియా యూజర్లు “Did you know there is currency named Raam being used in Iowa and Netherlands? #ram #currency #peace”. అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.


“1 Raam = 10 Euro Yes there is a currency used in Holland, named on Prabhu Shree Raam. जय श्री राम” ఒక రామ్ 10 యూరోలతో సమానం.. హోలాండ్ లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రభు శ్రీరాముడి పేరు మీద ఈ కరెన్సీని తీసుకుని వచ్చారు అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

ఇంకొందరేమో ఈ కరెన్సీని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించవచ్చు.. అంటూ చెబుతూ వస్తున్నారు.

నిజ నిర్ధారణ:

ఈ పోస్టులు ప్రజలను తప్పు ద్రోవ పట్టించేవి..!

రామ్ అన్నది ‘కరెన్సీ కాదు’. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ‘మహర్షి మహేష్ యోగి’ గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ తరపున ఏర్పాటు చేశారు. గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ ను అక్టోబర్ 7, 2020న స్థాపించారు. ప్రపంచంలోని 100కు పైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డాక్టర్లు, లాయర్లు.. మరెంతో మంది శాంతిని ఆకాంక్షిస్తున్న వారు గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ లో భాగమయ్యారు.

ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ మరింత ప్రాచుర్యం పొందాలనే ఆకాంక్షతో అక్టోబర్ 26, 2001న ‘రామ్’ ను మహర్షి గ్లోబల్ ఫైనాన్సింగ్, నెదర్లాండ్స్ తరపున విడుదల చేశారు. రామ్ ప్రపంచంలోని చాలా దేశాలలోని నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.

రామ్ అన్నది బేరర్ బాండ్ గా ఉపయోగిస్తూ ఉన్నారు. హోలాండ్ లోని ఫోర్టిస్ బ్యాంకు, లోవా లోని మహర్షి వేదిక్ సిటీలో మార్చుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో దీన్ని మార్చుకోవచ్చు అనే విషయంలో సరైన సమాచారం లేదు.

మహర్షి వేదిక్ సిటీ వెబ్ సైట్ కథనం ప్రకారం.. రామ ముద్రను స్థానికంగా ఫిబ్రవరి 24, 2002 న పంచడం మొదలుపెట్టారు. సిటీ కౌన్సిల్ కూడా రామ ముద్రను స్థానిక కరెన్సీగా అంగీకరించింది. స్థానికంగా ఉన్న వ్యాపారాలను అభివృద్ధి చేయవచ్చని వారు భావించారు. వీటిని స్థానిక వ్యాపారులు, సంస్థలు స్వీకరించేవి.

రామ్ మీద బీబీసీ ఫిబ్రవరి 5, 2003న కథనాన్ని ప్రచురించింది. అమెరికా, లోవా లోని మహర్షి వేదిక్ సిటీలో కూడా ఈ రామ్ ముద్రను అమెరికా డాలర్ తో కలిసి వినియోగించేవారు. రామ్ బేస్డ్ బాండ్లు 35 అమెరికా రాష్ట్రాల్లో అందుబాటులోకి తెచ్చారు.

మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆఫ్ మహర్షి మూమెంట్ బెంజమిన్ ఫెల్డ్మాన్ మాట్లాడుతూ రామ్ ను వినియోగించడం వలన పేదరికాన్ని దూరం చేయవచ్చని.. ప్రపంచం మొత్తం శాంతిని తీసుకుని రావచ్చని అన్నారు. ప్రభుత్వాలు రామ్ ను ఉపయోగించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం.. ఇతర ప్రాజెక్టులను కూడా పూర్తీ చేయొచ్చని అభిప్రాయ పడ్డారు.

రామ్ నోట్ లను డచ్ షాపులలో కూడా తీసుకునే వారు 10 యూరోలు గా భావించేవారు. 1,00,000కు పైగా రామ్ నోట్లు సర్క్యులేషన్ లో ఉన్నాయని.. వాటిని జాగ్రత్తగా పరిశీలించాలని.. ప్రజల్లో అయోమయాన్ని తీసుకుని రాకూడదని డచ్ సెంట్రల్ బ్యాంకు ప్రతినిధి గతంలో తెలిపారు.

మహర్షి మహేష్ యోగి ‘రామ్’ గురించి మాట్లాడుతున్న వీడియో యూట్యూబ్ లో ఉంది.

నెదర్లాండ్స్ లోనూ అమెరికా లోని లోవాలోని మహర్షి వేదిక్ సిటీలో వీటిని బేరర్ బాండ్లుగా వాడారన్నది నిజమే..! కానీ ఇప్పుడు కూడా ఇవి అందుబాటులో ఉన్నాయా లేదా అన్నదానిలో సరైన సమాచారం లేదు. రామ్ ను డాలర్లు, పౌండ్లకు బదులుగా ఎక్స్ ఛేంజ్ కూడా చేసుకున్నారు. 10 డాలర్లు, 10 పౌండ్లు గా దీనికి వెల కట్టారు కానీ.. ఇవే ప్రపంచంలో కెల్లా ఖరీదైన బేరర్ బాండ్లు కావు.

రామ్ అన్నది డాలర్, పౌండ్ల కన్నా ఖరీదైనదే.. అయితే ఇది సాధారణంగా ఉపయోగించే నగదు మాత్రం కాదు. వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదావ పట్టించేవి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.