కన్నీరు పెట్టిస్తున్న ఘ‌ట‌న‌ : తండ్రి చివ‌రి చూపుకు ఆమెకు ద‌క్కింది మూడంటే మూడే నిమిషాలు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2020 10:00 AM GMT
కన్నీరు పెట్టిస్తున్న ఘ‌ట‌న‌ : తండ్రి చివ‌రి చూపుకు ఆమెకు ద‌క్కింది మూడంటే మూడే నిమిషాలు..

క‌రోనా తెచ్చిపెట్టిన క‌ష్టాలు అన్నీఇన్నీ కావు. ప్ర‌పంచాన్ని ఇళ్ల‌కు ప‌రిమితం చేసిన క‌రోనా.. ఎంద‌రినో తమ సొంత‌వాళ్ల‌కు దూరం చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మీయుల‌ను చివ‌రి చూపుల‌కు కూడా నోచుకోకుండా చేసి చోద్యం చూస్తుంది. తాజాగా.. అనారోగ్య ప‌రిస్థితుల కారణంగా మరణించిన తండ్రికి అంతిమ వీడ్కోలు నేఫ‌థ్యంలో.. కరోనా అనుమానితురాలిగా ఉన్న కూతురుకి కేవలం 3 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చిన ఘ‌ట‌న ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రిని కంట‌నీరు పెట్టిస్తుంది.

వివ‌రాళ్లోకెళితే.. మణిపూర్ రాష్ట్రంలోని కాంగ్‌పోక్పికి చెందిన అంజలి హమంగ్తే(22) అనే యువతి మే 25న శ్రామిక్ రైల్‌లో చెన్నై నుండి త‌న సొంత‌ రాష్ట్రానికి చేరుకుంది. అయితే రైలులో అంజలితో పాటు ప్రయాణించిన ఒక‌రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అంజలిని కూడా క్వారంటైన్ సెంటర్‌కి తరలించారు.

అయితే.. అంజ‌లి తండ్రి ఇటీవల మరణించారు. దీంతో తన తండ్రికి అంతిమ వీడ్కోలు పలికేందుకు తనకు అనుమతి కావాల‌ని ఆమె అధికారులను కోరింది. అంజ‌లి విఙ్ఞప్తిపై అధికారులు ఆమెకు.. పీపీఈ కిట్ వేయించి, ప్రత్యేక అంబులెన్స్‌లో గురువారం ఇంటికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ అంజ‌లి ఉండ‌టానికి కేవ‌లం 3 నిమిషాలు సమయం మాత్రమే ఇచ్చారు. స్టాప్‌వాచ్‌ల్లో మూడు నిమిషాల స‌మ‌యం ముగిసిన వెంట‌నే అంజలిని అక్కడి నుండి క్వారంటైన్‌కు తరలించారు. అంతేకాదు.. ఆ సమయంలో అంజలి దగ్గరకు ఆమె కుటుంబసభ్యులను సైతం రానివ్వలేదు. ఇదిలావుంటే.. మణిపూర్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 121 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Next Story
Share it