ఎవరీ పీవీ రమేశ్.. ఇప్పుడెందుకు అందరి నోట్లో నానుతున్నారు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 July 2020 5:52 AM GMT
ఎవరీ పీవీ రమేశ్.. ఇప్పుడెందుకు అందరి నోట్లో నానుతున్నారు?

మీడియాలో వచ్చే కొన్ని కథనాలు.. జరిగే ప్రచారాలు చూస్తే.. టార్గెట్ చేసినట్లుగా కనిపించక మానవు. రిటైర్ అయిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఒక ముఖ్యమంత్రి ఏరి కోరి తెచ్చుకున్న తర్వాత ఆయన్ను టార్గెట్ చేస్తారా? అలా చేయాల్సి వస్తే.. నష్టం సదరు అధికారి కంటే కూడా తనకే ఎక్కువన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వారు ఆలోచించరా? కోరి తెచ్చుకున్న వారికి కంఫర్ట్ లేకుండా చేయటం వల్ల సాధించేదేమిటి? అన్నది అసలు ప్రశ్న.

తాజాగా జగన్ టీంలో కీలకభూమిక పోషించే అధికారుల్లో పీవీ రమేశ్ ఒకరు. ఆయన సీఎంవోలోని కీలక అధికారుల్లో ఒకరు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయన.. రిటైర్ అయినప్పటికీ కోరి తెచ్చుకొని మరీ ముఖ్యమంత్రి కార్యాలయంలో చోటు కల్పించారు. అర్థిక శాఖతో పాటు మరికొన్ని సబ్జెక్టుల్ని చూసే పీవీ రమేశ్ వద్ద ఉన్న శాఖల్ని ముఖ్యమంత్రి ఈ మధ్యన తొలగించటం తెలిసిందే. ఆ మాటకు వస్తే.. పీవీ రమేశ్ తో పాటు మురళి.. అజేయ్ కల్లం వద్ద ఉన్న శాఖల్ని తొలగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. పీవీ రమేశ్ ను సాగనంపే క్రమంలో సీఎం జగన్ పెద్ద డ్రామా ఆడుతున్నట్లుగా కథనాలు తెర మీదకు వస్తున్నాయి. ఇందులో నిజాల్ని చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఒక రిటైర్ అయిన అధికారిని కోరి తెచ్చుకొని మరీ పక్కన పెట్టేయటం ఎవరైనా చేస్తారా? అన్నది చిన్న ప్రశ్న. అంతర్జాతీయ సంస్థ యూఎన్ డీపీలో తొమ్మిదేళ్లు పని చేసిన రమేశ్ కు సమర్థుడైన అధికారిగా పేరుంది.

రాష్ట్ర విభజన సమయంలోనూ.. రాష్ట్ర పునర్విభజన విభాగం కార్యదర్శిగా కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన సమర్ధవంతంగా తనకు అప్పగించిన పదవుల్ని నిర్వహించారు. ఆయన పని తీరు గురించి తెలుసుకున్న తర్వాత ఆయన్ను సీఎంవోలోకి తెచ్చి పెట్టుకున్నారు జగన్. అదనపు సీఎస్ హోదా ఇచ్చి కీలక బాధ్యతలు అప్పజెప్పారు. కరోనా వేళ.. రాష్ట్రంలో దాని వ్యాప్తికి చెక్ చెప్పటంలో పీవీ రమేశ్ కీలకమన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

ఆయన సమర్థత కారణంగానే ఏపీలో కరోనా వ్యాప్తికి చెక్ చెప్పే విషయంలో మంచి పేరు వచ్చింది. ఇటీవల కొన్ని బాధ్యతల్ని మార్చే క్రమంలో సీఎంఓలోని ముగ్గురు కీలక అధికారుల వద్ద ఉన్న సబ్జెక్టుల్ని వెనక్కి తీసుకున్నారు సీఎం జగన్. దీన్నో సాకుగా తీసుకొని.. పీవీ రమేశ్ పేరుతో ముఖ్యమంత్రిని దెబ్బ తీసేలా ప్రచారాన్ని షురూ చేశారని చెబుతున్నారు. మరి.. ఇలాంటి ప్రచారానికి సీఎం జగన్ ఎలా చెక్ పెడతారో చూడాలి.

Next Story
Share it