వెక్కిరించిన విధిని ధిక్కరించి..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 19 Aug 2020 9:01 AM GMTఅన్నీ బాగున్నా అనుకున్న లక్ష్యాలు చేరుకోలేక చతికిలపడేవారు కోకొల్లలు. తమ వైఫల్యాలకు కారణాలు వెదకడంలోనే వారి పుణ్య కాలం గడచిపోతుంటుంది. వారి వల్లనో వీరి వల్లనో తాము విజయం అందుకోలేకపోయామని చెబుతుంటారు. అయితే చిత్తశుద్ధి బాగుండి సంకల్ప సిద్ధితో ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. అంతా సుసాధ్యమే అంటున్నారు వీరిద్దరు. ఆ దేవుడు చూపు తీసుకున్నా.. సాధించే సుగుణాన్ని మాత్రం వదిలేశాడు. అదే వీరి విజయ మంత్రమైంది.
తమిళనాడుకు చెందిన బాలనాగేంద్రన్, పురాణ సుందరి ఇద్దరూ చూపు లేనివారే. అయితేనేం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ –2019 పరీక్షల్లో విజయకేతనం ఎగురవేశారు. తమిళనాడు రాష్ట్రం నుంచి 60 మంది పరీక్షల్లో సత్పలితాలు సాధించారు. వారిలో వీరిద్దరూ ఉన్నారు.
బాలనాగేంద్రన్ చాలా సార్లు ప్రయత్నించినా విజయం అంచుదాకా వచ్చి ఆగిపోయారు. తన తొమ్మిదో ప్రయత్నంలో గెలుపొందారు. తన విజయానికి కారణం ఇంటివారి సపోర్టే అని బాలనాగేంద్రన్ అంటారు. పరీక్షలకు సిద్ధం కావడంలో అందరూ సహకరించారన్నారు. పుస్తకాలంటే విపరీతమైన ఆసక్తి ఉన్న ఈ పుస్తక ప్రేమి రచయితలు జయకాంతన్, డాన్ బ్రౌన్ అంటే ఎక్కడ్లేని అభిమానం.
ఇక పురాణ సుందరికి చూపు లేకపోవడం పెద్ద అవరోధంగా మారలేదు. తన నాలుగో ప్రయత్నంలో యూపీఎస్‌సి పరీక్షలో విజయం సాధించారు. తనకు 286వ ర్యాంకు రావడంతో ఆనందానికి అవధుల్లేవని అంటున్నారు. తన అయిదోఏట దాకా చూపు బాగానే ఉండేదని అన్నీ స్పష్టంగా కనిపించేవని చెబుతున్న సుందరి క్రమంగా చూపు మందగించిందని వివరించారు. రెటినల్ డీ జనరేటివ్ వ్యాధి వల్లే చూపు మందగించిందని డాక్టర్లు గుర్తించారు. సుందరికి ఒకటో తరగతి చదువుతున్నప్పుడే కంటి వెలుగు మసకబారింది.
మధురైలోని అరవింద్ కంటి ఆస్పత్రి డాక్టర్లు ఎడమ కంటి చూపు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం.. కుడివైపు కంటిచూపు లేనట్టే అని తేల్చి చెప్పారు. అయితే నేత్ర శస్త్రచికిత్స విజయవంతం కాలేదు. ఫలితంగా రెండు కళ్ళూ వెలుగు కోల్పోయాయి. మరొకరయితే మనోవ్యాధితో మంచం పట్టేవారే. కానీ తల్లిదండ్రులు అన్నివిధాల సహకరించి ప్రోత్సహించడంతో సుందరి గుండెధైర్యం కోల్పోకుండా ముందడుగు వేసింది. తల్లి అవుదైదేవి తనకు అన్నివిధాలా తోడుగా నిలిచారు. రోజూ సుందరి పాఠాలు చదివి ఆమె పరీక్షల్లో విజయం సాధించేందుకు మూలకారకులయ్యారు.
సుందరి తండ్రి మురుగేశన్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. కూతురు విజయాలు తనకెప్పుడూ స్పూర్తి దాయకాలని వ్యాఖ్యానించారు. సుందరి పదోతరగతిలో 500కు 471 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచారు. అలాగే ప్లస్ టు పరీక్షల్లో 1200కు 1092 మార్కులు స్కోర్ చేశారు. స్థానిక ఫాతిమా కళాశాలలో డిగ్రీలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్ తీసుకుని అద్భుత విజయం సాధించారు. ఇన్ని విజయపరంపరల్లో ఏనాడు తనకు చూపులోపం ఉందన్న ఆలోచన తనకూ రానీలేదు.. తల్లిదండ్రులకూ రాలేదు. తను 11వ తరగతిలో ఉన్నప్పుడే ఐఏఎస్ కావాలని కలలు గనేదాన్ని.. ఇన్నాళ్ళకు నా కలలు నిజమయ్యాయి అని సుందరి తెలిపింది. విద్య, వైద్య, స్త్రీ సాధికారత రంగాల్లో సేవలందించాలని ఉందని సుందరి వివరించారు.
మహమ్మద్ కైఫ్ తన ట్విటర్‌లో సుందరి విజయాన్ని పంచుకున్నారు.‘ 25 ఏళ్ళ తమిళ అమ్మాయి సుందరి తన దైహిక అవరోధాలను అధిగమించి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. సివిల్ పరీక్షలకు ఆడియో పుస్తకాలు లభించడం చాలా కష్టంగా మారిన నేపథ్యంలో తల్లిదండ్రులే పుస్తకాలను చదివి రికార్డు చేసి వాటిని ఆడియో పుస్తకాలుగా మార్చి కూతురి విజయానికి దోహద పడ్డారు. ఇది సుందరికే కాదు తల్లిదండ్రులకూ గర్వకారణం. కలలను చేదించు.. విజయం సాధించు’ అని ట్వీట్ చేశారు.
సాధనమున పనులు సమకూరు ధరలోన అంటే ఇదేగా! గెలుపు తీరాలకు చేరుకోవాలంటే తెలివితోపాటు కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఎటువంటి సమయంలోనూ నిరాశకు లోను కారాదు. తన లోపాన్ని ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా, మొక్కవోని దీక్షతో ముందుకు సాగినట్లు సుందరి తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదు. జీవితంలో మనకంటూ ఓ లక్ష్యం ఉండాలి. దాన్ని చేరుకోడానికి ఓ చక్కని గమ్యాన్ని రూపొందించుకోవాలి. ఇక విజయాలు అంటారా...వాటి గురించి ఆలోచించరాదు. అవే వెదుక్కొంటూ వస్తాయి అని ఈ ఇద్దరు ఉద్ధండులు అంటున్నారు. నిజమే కదా!!