అడవి నుంచి ఐఏఎస్‌ దాకా..

By మధుసూదనరావు రామదుర్గం  Published on  19 Aug 2020 5:53 AM GMT
అడవి నుంచి ఐఏఎస్‌ దాకా..

ప్రకృతి పుట్టినిల్లుగా పచ్చగా పరచుకున్న ఆ అడవి గుండెలోని ఓ కొండ ప్రాంతంలో ఆధునిక నాగరకతకు సుదూరంగా బతుకుతున్న ఓ బిడ్డ విజయగాధ ఇది. అన్ని వసతులుండీ.. తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటూ...కోరినవి సమకూరుతుంటే ఉన్నత చదువులు చదివే వారే మన దేశంలో అధికం. అందుకే గొప్ప చదువులు గొప్ప కొలువులు పేదలకు అందులోనూ గిరిజనులకు అందని ఫలాలే! అయితే మనోబలం ఉంటే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఓ గిరియువకుడు నిరూపించాడు. డాక్టరుగా ఐఏఎస్‌ కలెక్టరుగా మన్నెం జనాల ముంగిట నిలిచి వారిని ఆశ్చర్యానికి గురి చేసిన వీడియో పలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మహారాష్ట్ర దూలే జిల్లా సాక్రి తాలూకా లోని ఓ మారూమూల అటవీప్రాంతంలోని గిరిజన గ్రామం సామోడ్‌లో ఓ నిరుపేద కుటుంబంలో రాజేంద్ర భారుడ్‌ జన్మించారు. తనకు ఊహరాకముందే తండ్రి మరణించడంతో మగదిక్కులేని ఆ ఇంట్లో తల్లే సంసారాన్ని ఈదుకొచ్చింది. దుర్భర దారిద్రంలో రాజేంద్ర బాల్యం గడిచింది. చేతిలో డబ్బు లేనందున తండ్రి ఫొటో కూడా దక్కలేదు. దీంతో తండ్రి ఎలా ఉంటాడో తన రూపురేఖలేంటో కూడా రాజేంద్రకు తెలీదు. చెరుకు ఆకులతో కట్టిన పూరి గుడిసెలో ఉండేవారు. కష్టాలు చుట్టుముట్టాయని తల్లి ఏనాడు విధిని తిడుతూ కూర్చోలేదు. మా తలరాత ఇంతేనని నిట్టూర్చలేదు. చిన్న కుటుంబమే అయినా పూట గడవడానికైనా ఏదో ఒక ఉపాధి కావాలిగా. అందుకే ఆమె ఆ అడవిలో దొరికే ఇప్పపూలతో సారా తయారు చేసి అమ్మేది.

ఇంటి వద్దే సారా అమ్ముతుండటంతో ఎవరెవరో కొనడానికి వచ్చేవారు. అక్కడే తాగేవారు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు రాజేంద్ర ఏడిస్తే నోట్లో రెండు ఇప్పసారా చుక్కలు వేసి పడుకోబెట్టేది. వ్యాపారం జరిగే వేళలో బిడ్డ ఏడుస్తుంటే తాగేవారికి చిరాకు తెప్పిస్తుందని ఆ పని చేసేది. రాజేంద్ర పెద్దయ్యాక తన తల్లే ఈ విషయం చెప్పిందని తెలిపారు. రాజేంద్ర పెరిగాక తల్లికి సాయంగా ఉండేవారు. ఎర్రాడకెళ్లి మసాల పల్లీలో, చిరుతిళ్ళో మందుతాగేవారి కోసం తెచ్చేవాడు. తల్లి గుండెనిబ్బరంతో రాజేంద్రను పెంచి పోషించింది. తనకు వయసు రాగానే తనే తీసుకెళ్ళి బడిలో వేసింది. రాజేంద్ర జిల్లా పరిషత్‌ స్కూల్లో చదువుకున్నాడు. పుస్తకాలు పెన్నులు లేకున్నా (కొనడానికి డబ్బులుండేవి కావు) స్కూల్‌ జీవితాన్ని బాగా ఆస్వాదించాడు. గిరిజన గూడెం నుంచి స్కూలుక వెళ్ళిన మొదటి పిల్లాడు రాజేంద్రనే! ఎందుకంటే ఆ తాండాలో చదువుకు అంత ప్రాధాన్యం ఇచ్చేవారే కాదు.

ఓసారి పరీక్షలున్నాయని ఇంటి వద్ద చదువుకుంటుంటే.. పల్లీలు తీసుకు రమ్మని ఓ కస్టమర్‌ పురమాయించాడు. అయితే పరీక్షలున్నాయి చదువుకోవాలి నేను వెళ్ళనని రాజేంద్ర నిర్మొహమాటంగా చెప్పాడు. దానికా వ్యక్తి పగలబడి నవ్వుతూ.. ఓహో పరీక్షలు రాయాలా.. ఏంటి ఏ డాక్టరో ఇంజినీరో అయిపోదామానే..’ అని వెక్కిరించాడు. అయితే రాజేంద్ర తల్లి ‘అవునయ్యా నా బిడ్డ డాక్టరే చదువుతాడు..’ అని గట్టిగా బదులిచ్చింది. తల్లి మాటలు రాజేంద్రను బాగా ప్రభావితం చేశాయి. ఆమె నమ్మకాన్ని నిలబెట్టాలని ఆ క్షణానే నిశ్చయించుకున్నాడు.

ఎంత కష్టమైనా సరే ఉన్నత చదువులు చదవాలని.. నూటికి నూరు శాతం శ్రమించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే రాజేంద్రకు సీబీఎస్‌ఈ స్కూల్‌లో చేరడానికి అవకాశం వచ్చింది. అక్కల్కువ తాలూకాలోని ఆ స్కూలు తమ గ్రామం నుంచి 150 కి.మీ. దూరంలో ఉంది. ఇక తప్పనిసరిగా ఊరు వదలాల్సి వచ్చింది. రాజేంద్ర తల్లే స్వయంగా వచ్చి దిగబెట్టింది. తాను వెళ్ళలేక రాజేంద్ర వదలలేక బోరున విలపించారు. అయినా బిడ్డ బాగా చదువుకోవాలని సంకల్పించుకున్న ఆమె రాజేంద్రకు ధైర్యం చెప్పి భారంగా కదలింది.

అమ్మను ఊరిని వదలి దూరంగా ఉండటం రాజేంద్రకు చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇలాంటి అవకాశం వదులుకుంటే మళ్ళీ రాదని తన భావనలను పక్కన పెట్టి చదువుపై శ్రద్ద పెట్టాడు. రాజేంద్ర పట్టుదల, శ్రమ వృథా పోలేదు. 12వ తరగతిలో 97 శాతం మార్కులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. మంచి మార్కులు రావడంతో ముంబైలోని జిఎస్‌. మెడికల్‌ కళాశాలలో మెరిట్‌ సీటు వచ్చింది. కేవలం సీటే కాదు ఎన్నో స్కాలర్‌ షిప్‌లు వచ్చాయి. దీంతో చదువుకు హాస్టల్‌కు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సజావుగా సాగింది. అయినా తల్లి చేతిఖర్చులకు డబ్బులు పంపేది. తన ఇప్పసారా వ్యాపారాన్నీ కొనసాగించింది. ఎందుకంటే అదొక్కటే తన జీవనోపాధి కాబట్టి.

రాజేంద్ర ఎంబీబీఎస్‌‌ కొనసాగిస్తూనే యూపీఎస్‌సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటన్‌షిప్‌ కొనసాగుతున్నా... ఫైనల్‌ ఇయర్‌లో ఈ రెండు పరీక్షలకూ ప్రిపేర్‌ అయ్యాడు. అయితే తన తల్లికి రాజేంద్ర డాక్టరు చదువు చదువుతున్నాడని మాత్రం తెలుసు. ఈ యూపీఎస్‌సీ గురించి బొత్తిగా తెలీదు. కలెక్టర్‌ ఉద్యోగం అంటే ఏంటి? దానికి ఈ పరీక్షలు ఎందుకు రాయాలీ? ఈ విషయాలన్నీ ఆమెకు అర్థం కానివే! తన చిన్న ప్రపంచంలో బతికేస్తున్న ఆమె బిడ్డ పెద్ద చదువు చదువుతున్నాడని మాత్రమే అనుకునేది. ఆమెకు స్థానిక అధికారుల గురించే తెలీదు. తాసీల్దార్‌ అని ఎవరిని అంటారో ఆమెకు అందని అంశం.

చివరి సంవత్సరం పూర్తి కాగానే రాజేంద్రకు ఓ చేతిలో మెడిసిన్‌ డిగ్రీ.. మరో చేతిలో యూపీఎస్‌సీ పరీక్షలో విజయం సాధించిన ఫలితాలు.. డాక్టర్‌ కావాలా కలెక్టర్‌ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. డాక్టర్‌ అయితే కొందరికే తన సేవలందుతాయి. అదే కలెక్టర్‌ అయితే.. తన గ్రామానికి కూడా సేవలందించే అవకాశం లభిస్తుందని రాజేంద్ర కలెక్టర్‌ ఉద్యోగానికే మొగ్గు చూపారు. ఈ విజయంతో రాజేంద్ర స్వగ్రామానికి వెళ్ళారు. తెలిసిన ఓ నలుగురైదుగురు తనకు స్వాగతం పలికారు.

రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, కలెక్టర్‌ రాజేంద్రను అభినందించేందుకు ఆ గ్రామానికి.. ఆ చిన్ని గుడిసెకు వచ్చారు. తల్లికి ఈ సందడి ఎందుకో అర్థం కాలేదు. రాజేంద్ర తను డాక్టర్‌ చదువులో పాసైనట్లు తెలిపారు. ఆమె చాలా సంతోషించింది. కలెక్టర్‌ పరీక్షలో కూడా పాసయ్యాననగానే ఆమె కళ్ళల్లో నీళ్లు కదలడాయి. తన బిడ్డ శ్రమ ఫలించిందని చాలా సంతోషించింది. ఇలాంటి విజయగాధలు ఒక రాజేంద్రదే కాదు సంకల్ప సిద్ధితో శ్రమించే ప్రతి యువకుడిదీ!!

Next Story