వణుకు పుట్టించిన ఉమెన్‌ వారియర్లు..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  18 Aug 2020 1:10 PM GMT
వణుకు పుట్టించిన ఉమెన్‌ వారియర్లు..!

భారతీయులు ఎప్పటికీ మరచిపోలేని ఘట్టం.. కార్గిల్‌ యుద్ధం! ఎందరో సైనికులు తమ ప్రాణాలను ఎదురొడ్డి శత్రుమూకలపై అవిశ్రాంతంగా పోరాడిన రోమాంచిత సందర్భం కార్గిల్‌ యుద్దం. ఆ యుద్ధంలో భర్తల్ని, బిడ్డల్ని, సోదరుల్ని, తండ్రుల్ని పోగొట్టుకున్న వారెందరో.. ఇప్పటికీ వారి పెదాలపై ఓ విజయధరహాసం.. ఆ వీరమరణాలు వృథా కాలేదని. కార్గిల్‌ వార్‌ అనగానే వినిపించే ఇద్దరు ఉమెన్‌ వారియర్లు గుంజన్‌ సక్సేనా, శ్రీవిద్యా రాజన్‌!

భీకరపోరుగా సాగిన కార్గిల్‌ యుద్ధంలో చేతిలో గన్‌లు పట్టుకుని శత్రుస్థావరాల్లో సంచరిస్తూ.. సమరోత్సాహంతో యుద్ధభూమిలో తిరగాడిన ఈ ఉమెన్‌ వారియర్లు మనకు నిరంతర స్పూర్తి ప్రదాతలు. పదిహేడేళ్ల కిందట జరిగిన ఈ యుద్ధంలో గుంజన్, శ్రీవిద్యల పేర్లు భారత్‌ అంతటా మారుమోగాయి. గుంజన్‌ సక్సేనా దేశం కోసం తమ ప్రాణాలను గడ్డిపోచలా భావించి వీరోచితంగా పోరాడిన వీరుల కుటుంబంలో జన్మించింది. తండ్రి సోదరుడు ఇద్దరూ ఆర్మీలో ఉండటంతో గుంజన్‌ చిన్ననాటి నుంచే ఆర్మీపై ఇష్టం పెంచుకుంది.

1994లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్స్‌రాజ్‌ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తయ్యాక తను ఆర్మీలో చేరుతున్నట్లు కుటుంబానికి విస్పష్టంగా చెప్పింది. గుంజన్‌ సక్సేనా, శ్రీవిద్యా రాజన్ మొదటి ఉమెన్‌ ఐఏఎఫ్‌ ట్రైనీ పైలట్‌లుగా అందరికీ గుర్తుండి పోయారు. 2016 నుంచి సైన్యంలో మహిళా పైలట్‌లను చేర్చుకుంటున్నా.. 1999లోనే మొదటి మహిళా పైలట్‌లుగా మాత్రం వీరిద్దరి పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో మహిళా పైలట్‌లా.. ఆ వత్తిడి, విపరీతమైన శారీరక శ్రమ వారు తట్టుకోగలరా? అనే అనుమానాలకు గుంజన్, శ్రీవిద్యలు తెరదించగలిగారు. స్త్రీలు ఆర్మీలో క్రియాశీలకంగా ఉండగలరని వారు నిరూపించారు. అందుకే చాలా మంది యువతులకు వీరు రోల్‌మోడల్‌ లాంటి వాళ్లు.

1

నిజం చెప్పాలంటే అప్పట్లో యువతులు ఎయిర్‌ఫోర్స్‌లో చేరడానికి వెనకంజ వేసేవారు. ఒకవేళ వారు సిద్ధపడినా కుటుంబ సభ్యులు, బంధువులు మీకిది అవసరమా అన్నట్లు చూసేవారు. ఆర్మీలో పురుషాధిక్యతతోపాటు అసలు ఆడవాళ్ళేంటీ ఆర్మీలో చేరడమేంటీ అన్న చులకన భావన అప్పటి సమాజంలో చాలా మందిలో ఉండేది.

అయితే గుంజన్, శ్రీవిద్యలు ఒక గొప్ప ముందడుగు వేశారు. తొలి మహిళా పైలట్‌లుగా చాలా మంది యువతుల్లో వారు ధైర్యం నింపగలిగారు.ఆర్మీలో చేరడానికి కేవలం అర్హత ఒక్కటే కాదు పురుషులకు సమానంగా తామూ శ్రమించగలమని వారు తమకిచ్చిన టాస్క్‌లను సాధించి మరీ నిరూపించారు. తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించే ఒక్క అవకాశం కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్న గుంజన్, శ్రీవిద్యలకు ఒక అద్భుత అవకాశం దక్కింది. అదే 1999లో పాకిస్తాన్‌తో జరిగిన కార్గిల్‌ వార్‌.

యుద్ధ హెలికాఫ్టర్లు నడిపిన అనుభవం లేకున్నప్పటికీ లెప్టినెంట్‌ సక్సేనా, లెఫ్టినెంట్‌ శ్రీవిద్య పాకిస్తాన్‌ సైన్యాలు మోహరించి ఉన్న స్థావరాల్లో ఎంతో ధైర్యంగా నడిపారు. తమ కంటికి చిన్న పిట్ట కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాల్చిపడేసే శత్రుసైనికులున్న ప్రాంతాల్లో యుద్ధ హెలికాఫ్టర్లు నడిపారంటే.. వీరెంత సాహసికులో అర్థమవుతుంది. ఎంతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగిన ఆ యుద్ధంలో క్షతగాత్రులైన సైనికుల్ని సురక్షితంగా తరలించడంలో, వారికి వైద్య సదుపాయాలు అందజేయడంలో ఈ మహిళా పైలట్లు యుద్ధ క్షేత్రాన క్రియాశీలకంగా వ్యవహరించారు. తాము నడిపే విమానాల్లో ఎలాంటి ఆయుధాలు లేకున్నా.. రక్షించుకునే దారులు లేకున్నా ఈ యోధులు నిరుపమాన సాహసంతో సైనికుల వైద్యసహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

ఉత్తర కశ్మీర్‌ లోని ప్రమాదకర ప్రాంతాల్లో రాకపోకల్ని చాలా అలవోకగా కొనసాగించారు. ఇదే సమయంలో కార్గిల్‌ ఏయిర్‌ స్ట్రిప్‌ వద్ద ఎగరడానికి సిద్ధంగా ఉన్న సక్సేనా చోపర్‌పై పాకిస్తాన్‌ సైనికులు గురి చూసి రాకెట్‌ ప్రయోగించారు. అయితే అదృష్ట వశాత్తు అది మిస్‌ఫైర్‌ అయి వెనకనే ఉన్న కొండప్రాంతంలోకి దూసుకెళ్ళింది. వళ్ళు గొగుర్పొడిచే ఈ సన్నివేశంలో ఏమాత్రం తొణకని ధీశాలి ఎవరంటే గుంజన్‌ సక్సేనాయే!

గుంజన్, శ్రీవిద్యలను మృత్యువుకు దగ్గరగా తీసుకెళ్ళిన అనేక ఘటనల్లో ఇదొకటి మాత్రమే! ఆర్మీలో మిగిలిన సైనికుల్లాగానే వీరు కూడా దేశం కోసం తమ ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యే యుద్ధక్షేత్రంలో కాలిడారు. గుంజన్‌ ఓ రైఫిల్, ఓ రివాల్వర్‌ను తనతో ఉంచుకునేది. ఒకవేళ శత్రు స్థావరంలో అకస్మాత్తుగా విమానం దించాల్సి వస్తే.. విమానం నుంచి దిగి పోరాడేందుకు సిద్ధంగా ఆ ఆయుధాలు తనతో తీసుకెళ్ళేది.

గుంజన్‌ సక్సేన ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. యుద్ధంలో క్షతగాత్ర సైనికుల్ని తరలించే కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ఉత్తేజాన్ని కలిగించిందని తెలిపారు. దేశం కోసం ప్రాణాలను లెక్కచేయక పోరాడే సైనికులకు అందిస్తున్న సాయం పవిత్రం, పరమోత్కృష్టం అనిపించిందని చెప్పారు. ‘జీవితంలో హెలికాప్టర్‌ పైలట్‌ అవకాశం లభించేది చాలా కష్టం. యుద్ధంలో మాకా అరుదైన అవకాశం లభించింది. అదే మాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింద’ని గుంజన్‌ ఉద్వేగంతో తెలిపారు.

22

యుద్ధంలో దెబ్బతిన్న సైనికుల్ని సురక్షత ప్రాంతాలకు తరలించడం చాలా అద్భుతమైన కార్యంగా నాకు తోచింది. అంటే నిస్సహాయ స్థితిలో మృత్యువు అంచున ఉన్న ఓ వీరునికి ఆపన్నహస్తం అందివ్వడంలో ఉన్న తృప్తి మరే పనిలో ఉండదని నా భావన అంటోంది గుంజన్‌ సక్సేనా. లక్నోలోని ఆర్మీ కుటుంబంలో సక్సేనా జన్మించింది. తండ్రి లెఫ్టినెంట్‌ కల్నల్‌ అశోక్‌ కుమార్‌ సక్సేనా ఆర్మీ నుంచి రిటైర్‌ అయ్యారు. సక్సేనా ఆమె సోదరుడు ఇద్దరూ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో సేవలందించారు.

గుంజన్‌ సక్సేనా తొలి ఆర్మీ మహిళా పైలట్‌గా ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ నుంచి అరుదైన పురస్కారం అందుకుంది. గుంజన్‌ శ్రీవిద్యలకు ఫైటర్‌జెట్లు నడిపే అవకాశాలు రాకున్నా.. వారు తమదైన బాటలో నడిచి తమ ఉనికిని చాటుకున్నారు. దేశం కోసం ఆర్మీ సేవలందించాలనుకునే చాలా మంది యువతులకు వారి జీవితాలు ప్రేరణగా నిలుస్తున్నాయి. సంప్రదాయాల పేరుతోనో.. ఆచారాల ముసుగులోనో మహిళలకు సరైన అవకావాలు రావడం లేదు. ముఖ్యంగా ఆర్మీలో. గుంజన్‌ సక్సేనా, శ్రీవిద్యలను చూశాకైనా, వారి వీరగాధలు విన్నాకైనా కొందరి భావనల్లో మార్సు కచ్చితంగా వస్తుందని.. రావాలని ఆశిద్దాం!!

Next Story