ఏమీ చేయలేక పోయా.. అందుకే నిష్క్రమిస్తున్నా..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  13 Aug 2020 1:05 PM GMT
ఏమీ చేయలేక పోయా.. అందుకే నిష్క్రమిస్తున్నా..!

ఈ రాజకీయాల వల్ల ఏమీ కాదన్న విషయం నాకు అర్థమైంది. ఎవరికోసమైతే తపన పడ్డానో, ఎవరికోసమైతే ఆరాటపడ్డానో ఆ ప్రజలే నన్ను పట్టించుకోనపుడు ఇక ఈ రంగంలో ఉండటం నిరర్థకమనిపించింది. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా..’ అన్నారు జమ్ముకశ్మీర్‌ పీపుల్స్‌ మూమెంట్స్‌ పార్టీ వ్యవస్థాపకుడు షా ఫైజల్‌. ఆయన ఆగస్టు 10న రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు.

రాజకీయాల్లోకి రాకముందు జమ్ము కశ్మీర్‌ ఐఏఎస్‌ అధికారిగా సేవలందించిన ఫైజల్‌ సరిగ్గా ఏడాది కిందట తను రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. అన్నట్టుగానే జెకేపీఎం పార్టీని స్థాపించారు. అప్పట్లో ఆర్టికల్‌ 370 రద్దుపై తీవ్రంగా విమర్శించారు. ఐఏఎస్‌ టాపర్‌గా సివిల్‌ సర్వీస్‌లో ఉన్న షా ఫైజల్‌ రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తే.. ఏడాది లోపే తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడం మరింత ఆశ్చర్యం కలిగిందింది.

‘ఈ యూటర్న్‌ నిర్ణయం వల్ల అందరూ తనను రాజీనామాల వ్యక్తి అని విమర్శించవచ్చు గాక.. కానీ ఇదో వ్యూహాత్మక నిర్ణయం. ప్రజలే వెన్నుపోటు పొడవడానికి సిద్ధమైనపుడు.. ఎవరైనా ప్రజా పోరాటానికి ఎందుకు ముందుకు రావాలి.. అయినా కచ్చితంగా నాకన్నా సమర్థులుంటారుగా.. నేను మార్చలేని వాటిని మార్చడానికి’ అని వ్యాఖ్యానించారు.

అయితే ఫైజల్‌ రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నారు? జైలు నిర్బంధంలో ఉన్నప్పుడు జీవితం ఎలా అనిపించింది.. తన తదనంతరం కశ్మీర్‌లో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? సెలిబ్రిటీ బ్యూరోక్రాట్‌ నుంచి ఔత్సాహిక రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఫైజల్‌ ఉన్నట్టుండి ఇలా వెనుదిరిగారెందుకు? పరిశీలకుల్లో తలెత్తుతున్న సందేహాలివి. ఈ విషయంగా సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 ఇంటర్వ్యూ చేసినపుడు షా పలు అంశాలను చెప్పుకొచ్చారు.

నా చర్య చాలామందికి ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు. కానీ జీవితంలో ఒక దశ నుంచి మరో దశకు మారుతున్నప్పుడు ఇలాంటి మార్పులూ సహజమే . ప్రతి ఒక్కరూ జీవితంలో పెద్ద సవాళ్లను ఎదుర్కోవాలని కాంక్షిస్తుంటారు. కొన్ని సార్లుగెలవచ్చు.. కొన్ని సార్లు గెలవక పోవచ్చు. ఇదేం వింత విషయం కాదు. ఏడాది పాటు పోలీసు నిర్బంధంలో ఉన్నప్పుడే ఈ ఆలోచన వచ్చిందా అని ప్రశ్నిస్తే.. నిజమే నాకు కాస్త విరామం దొరికింది అప్పుడే. నేను లోపల ఉన్నప్పుడు నా కుటుంబం చాలా ఆవేదనకు గురైంది. వారు ఎంతగానో కష్టపడ్డారు. మరో విషయం నా నిర్బంధం సరికాదని ఓ పాత్రికేయుడు వార్తా కథనం రాసిన పాపానికి చాలామంది ఆయన్ను రకరకాలుగా దూషించారు. అంతేకాదు నన్ను విపరీతంగా ట్రోల్‌ చేశారు. ఎందుకిలా చేశారు? అని ప్రశ్నించుకుంటే సరైన సమాధానం లేదు.

ఎవరికోసమైతే నేను పోరాడానో వారే నన్ను గుర్తించే పరిస్థితి లేనపుడు నా పోరాటానికి అర్థం లేదు కదా! అందుకే ఈ నిష్క్రమణ నిర్ణయం.. అంటూ బదులిచ్చారు. రాజకీయాలంటే ఏంటో బహుశా మీకిప్పటికే అర్థమై ఉంటుంది. రాజకీయరంగం పూలదారేం కాదు. ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ప్రభుత్వాల నుంచి, మరికొన్ని సార్లు కుటుంబం నుంచి తీవ్ర వత్తిళ్ళు వస్తుంటాయి. వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా.. అంటే నేను త్యాగాలకు ఎప్పటికీ వెనకడుగు వేయను. ఇప్పటికే చాలా త్యాగాలు చేశాను. అయితే రాజకీయ నాయకులుగా మేం ఎదుర్కొంటున్న సవాళ్ళను, మేం చేస్తున్న పోరాటాలను ప్రజలు కనీసం గుర్తించకపోవడం బాధాకరం. విమర్శలు, తిట్లు తప్ప నాయకులకేం లభించవు అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు.

‘నేను గత ఏడాదిగా నిర్బంధంలో ఉన్నప్పుడు ఎవరూ నా కుటుంబాన్ని పట్టించుకోలేదు. చివరికి నా అత్యంత సన్నిహిత స్నేహితులు కూడా. చివరికి ప్రాణత్యాగం చేసినా ఇక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోర’ని ఫైజల్‌ షా అన్నారు. ఫైజల్‌ షా గతంలో ఐఏఎస్‌ విధులు నిర్వర్తించినట్టుగానే ముందుకూడా అదే సర్వీసులో కొనసాగడానికి సిద్ధమయ్యారు.

అయితే భవిష్యత్తులో కూడా ప్రజాసేవ చేస్తానని, విద్య ఆరోగ్యం, ఉద్యోగ కల్పన తదితర అంశాలపై తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఇకపై కొత్త ప్రపంచంలో సరికొత్త ప్రయాణం ప్రారంభిస్తానని అన్నారు. తదనుగుణంగానే ట్విటర్, తదితర సోషల్‌ మీడియా అకౌంట్లలో తన పాత జ్ఞాపకాలను తొలగించారు. తను ప్రస్తుతం మెడికోనని తెలిపారు.

కశ్మీర్‌లోని కుప్వారాకు చెందిన షా ఫైజల్‌ 1983లో ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. షాకు 19 ఏళ్ల వయసున్నప్పుడే ఆయన తండ్రిని మిలిటెంట్లు కాల్చి చంపారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఎమ్బీబీఎస్‌ చదివి డాక్టరైన షా 2010లో సివిల్స్‌ టాప్‌ ర్యాంకర్‌ గా నిలిచారు. అనంతరం జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వాధికారిగా నియమితలయ్యారు.

కశ్మీర్‌లో తరచూ జరిగి మహిళల అత్యాచారాలపై ట్వీట్లు చేసి వివాదంలో చిక్కుకున్నారు. 2018లో కశ్మీర్‌ ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో బాధ్యతాయుతమైన ఆఫీసరుగా ఉండి అనుచితంగా ప్రవర్తిస్తున్నారని నోటీసులు జారీ చేసింది. అప్పుడే విధుల నుంచి సెలవు తీసుకుని ఫుల్‌టైమ్‌ ఫెలోషిప్‌ కోసం హార్వర్డ్‌ కెన్నడీ స్కూల్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఏడాదికే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

‘చివరాఖరికి నాకు అర్థమైందేంటంటే.. కష్టసమయాల్లో కుటుంబం తప్ప ఎవరూ తోడుగా నిలవరు. నేను నిర్బంధంలో ఉన్నప్పుడు జీవితం నాకు నేర్పిన కొత్త పాఠం ఇది’ అన్న ఫైజల్‌ వ్యాఖ్య ఆయన జీవన గమ్యాన్ని తెలుపుతుంది.

Next Story