వ్యభిచారం నేరమని ఏ చట్టంలోనూ లేదు.. నచ్చిన వృత్తిని మహిళలు ఎంచుకోవచ్చు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2020 2:44 PM GMT
వ్యభిచారం నేరమని ఏ చట్టంలోనూ లేదు.. నచ్చిన వృత్తిని మహిళలు ఎంచుకోవచ్చు..!

వ్యభిచారం నేరమని ఏ చట్టంలోనూ లేదు.. నచ్చిన వృత్తిని మహిళలు ఎంచుకోవచ్చని బాంబే హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు మహిళలకు విముక్తి కల్పిస్తూ బాంబే హై కోర్టు తీర్పును ఇచ్చింది. జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ మాట్లాడుతూ.. గతేడాది వ్యభిచారం కేసులో పట్టుబడిన ముగ్గురు యువతులను వుమెన్‌ హాస్టల్‌కు తరలించమని ఆదేశించిన దిగువ కోర్టు నిర్ణయం సరికాదన్నారు.

పీఐటీఏ-1956లో వ్యభిచారాన్ని రద్దు చేయమని ఎక్కడా చెప్పలేదని.. దానిని శిక్షార్హమైన నేరంగా చెప్పలేదని.. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వాళ్లకు శిక్ష విధించాలన్న నిబంధన లేదని ఆయన అన్నారు. ఒక మనిషిని మోసం చేసి, స్వప్రయోజనాల కోసం దోపిడీకి పాల్పడితే మాత్రం శిక్షించదగ్గ నేరమేని అన్నారు ఆయన.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ముగ్గురు యువతులు(20, 22, 23 వయస్సు గల వారు) గతేడాది మలాద్‌లోని ఓ గెస్ట్‌హౌజ్‌లో పోలీసులు నిర్వహించిన రైడింగ్ ‌లో పట్టుబడగా.. ఈ యువతులను బాధితులుగా పేర్కొన్నారు. విటుడిని అరెస్టు చేసి పీఐటీఏ కింద కేసు నమోదు చేశారు.

కేసును విచారించిన దిందోషి సెషన్స్‌ కోర్టు, వారిని మహిళల వసతి గృహానికి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సదరు యువతులు హైకోర్టును ఆశ్రయించి, తమకు విముక్తి కల్పించాల్సిందిగా అభ్యర్థించారు. తమ తల్లుల దగ్గరకు వెళ్లేందుకు దిగువ కోర్టు అనుమతినివ్వలేదని, తమ సామాజిక వర్గం ఈ వృత్తితోనే జీవనోపాధి పొందుతోందని అన్నారు.

దీంతో బాంబే హైకోర్టు మానవ అక్రమ రవాణా(నిరోధక) చట్టం గురించి గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎక్కడైనా నివసించే, నచ్చిన వృత్తిని చేపట్టే హక్కు ఉందని తెలిపింది. తక్షణమే వారికి విముక్తి కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సదరు యువతులు అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే వారు ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తే బాగుండేదని జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్ అన్నారు.

Next Story
Share it