ఆ మంత్రికి ప్రమోషన్ ఇవ్వనున్న జగన్..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2020 12:04 PM GMT
ఆ మంత్రికి ప్రమోషన్ ఇవ్వనున్న జగన్..!

తండ్రి బాటలోనే నడుస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. నమ్మిన వారికి కీలక పదవులు అప్పజెప్పటం.. అదే సమయంలో ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవటంలో ఆయన తన చతురతను ప్రదర్శిస్తున్నారు. తనకెంతో సన్నిహితమైన ఇద్దరు మంత్రుల్ని రాజ్యసభకు పంపటం ద్వారా నాలుగు పదవుల్ని ఖాళీ అయ్యేలా చేశారు జగన్. దీంతో.. అధికార పార్టీలో పదవుల్ని ఆశించే వారికి మరిన్ని అవకాశాలు కలిగేలా చేశారు.

రాజ్యసభకు వెళ్లిన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణ స్థానంలో రేపు మంత్రివర్గ ఖాళీల్ని భర్తీ చేస్తున్న నేపథ్యంలో.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించనున్నారు అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఇప్పటివరకూ వినిపించిన పేర్లకు భిన్నంగా మంత్రి పదవుల విషయంలో తన మార్కును చూపించారు జగన్. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతకు అవకాశం ఇచ్చారు. అదే సమయంలో గోదావరి జిల్లాకు చెందిన మంత్రి స్థానాన్ని అదే జిల్లాలకు చెందిన వారికి కట్టబెట్టేలా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

బుధవారం జరిగే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో పిల్లి స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాల్ కు అవకాశం ఇవ్వనున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వేణుగోపాల్ కు అరుదైన అవకాశం లభించినట్లే. ఇక.. మోపిదేవి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన సిదిరి అప్పలరాజుకు కట్టబెట్టబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో.. ఈ ఇద్దరు మంత్రులుగా కొత్త ముఖాలు తెర మీదకు రానున్నాయి.

మరి.. ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పిల్లి బాధ్యతను ఎవరికి అప్పజెబుతారన్నది ఆసక్తికర చర్చగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన జగన్.. తనకు సన్నిహితుడైన ధర్మాన కృష్ణదాస్‌కు కట్టబెట్టే అవకాశమే ఎక్కువని చెబుతున్నారు.

పిల్లిది బీసీ సామాజిక వర్గం కావటం.. అదే సామాజిక వర్గానికి చెందిన ధర్మాన అయితే లెక్క సరిపోతుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని వివాదాలు ఆయన చుట్టుముట్టినప్పటికీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మరి.. సీఎం తనకిస్తున్న ప్రమోషన్ కు ధర్మాన ఎంతవరకు న్యాయం చేస్తారన్నది కాలమే నిర్ణయించాలి.

Next Story