డెడ్‌లైన్ కంటే ముందే బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 July 2020 8:49 PM IST
డెడ్‌లైన్ కంటే ముందే బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ

సీనియర్ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రం ఇచ్చిన డెడ్ లైన్ కంటే ముందే ఢిల్లీ లోధీ ఎస్టేట్ లోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆగస్ట్ 1వ తేదీ నాటికి బంగ్లాను ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం గడువు విధించగా.. గడువులోగానే బంగ్లాను ఆమె ఖాళీ చేశారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ప్రియాంకకు ప్రభుత్వ బంగ్లాను కేటాయించడం కుదరదని, ఆగస్ట్ 1 నాటికి బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆమెకు నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ గురుగ్రామ్ లోని పెంట్ హౌస్ లో కొద్దిరోజుల పాటూ ఉండనున్నారు. ఆ తర్వాత ఆమె సెంట్రల్ ఢిల్లీ లోని ఓ ఇంటికి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం ఆమె కొత్త ఇంటి పనులు జరుగుతుండడంతో గురుగ్రామ్ లోని ఓ ఇంట్లో ఆమె కొద్దిరోజుల పాటూ ఉండనున్నారు.

ప్రియాంకకు గత ఏడాది ఎస్పీజీ భద్రతను కేంద్రం తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు. లోధీ ఎస్టేట్ లో బంగ్లా 35లో ఆమె 1997 నుండి ఉంటున్నారు. సెక్యూరిటీని తొలగించిన కారణంతోనే ఆమెను ఆ ఇల్లు ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది.

ప్రియాంక గాంధీ ఖాళీ చేసిన ఆ బంగళాలోకి రాజ్యసభ సభ్యులు అనిల్ బులానీ రానున్నారు. దీంతో.. తమ ఇంటికి తేనీటి విందుకు రావాలని ప్రియాంక పిలిచారు. దీనికి రియాక్ట్ అయిన బులానీ.. తాను కేన్సర్ చికిత్స తర్వాత ఇంటికి వచ్చానని.. డాక్టర్లు ఇంట్లోనే ఉండమన్నారని.. అందుకే తాను ప్రియాంక ఆహ్వానించినట్లుగా తేనీటి విందుకు రాలేనని చెప్పారు. అందుకు భిన్నంగా తమ ఇంటికే ప్రియాంక కుటుంబాన్ని తమ ఇంటికి డిన్నర్ కు రావాలని ఆహ్వానించారు.

Next Story