ప్రైవేటు రైళ్ల కోసం బరిలోకి బడా కంపెనీలు.. సౌత్ లో రూట్లు ఇవేనట

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Aug 2020 7:42 AM GMT
ప్రైవేటు రైళ్ల కోసం బరిలోకి బడా కంపెనీలు.. సౌత్ లో రూట్లు ఇవేనట

విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవటానికి పెట్టింది పేరైన ప్రధాని మోడీ.. ఇటీవల ప్రైవేటు రైళ్లను భారత పట్టాల మీద పరుగులు తీయించాలన్న కీలక నిర్ణయానికి రావటం తెలిసిందే. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో పట్టాల మీదకు రానున్న ప్రైవేటు రైళ్లను రద్దీగా ఉండే రూట్లలో పరుగులు తీసేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది.

గుజరాత్ లోని పలనాపూర్ నుంచి హర్యానాలోని రేవార్ మధ్య 650 కి.మీ. మార్గంలో ప్రైవేటు రైళ్లను తొలుత ప్రవేశ పెట్టనున్నారు. తర్వాతి కాలంలో దేశ వ్యాప్తంగా 12 క్లస్టర్లలో ఈ సేవల్ని విస్తరించనున్నారు. 2021లో కంపెనీలకు కాంట్రాక్టును అప్పగిస్తారు. 2023 ఏప్రిల్ నాటికి ప్రైవేటు రైళ్ల సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు బాట పట్టిన రూట్లకు సంబంధించి మొత్తం యాభై ప్రధాన రైల్వే స్టేషన్లలో నిర్వహణను సదరు కంపెనీలకు అప్పగిస్తారు. అలా పరిష్మన్లు పొందిన కంపెనీ చేతిలో 35 ఏళ్ల పాటు స్టేషన్లను పెడతారు.

రైళ్లు నడిపే డ్రైవర్లు.. గార్డులను రైల్వే బోర్డు నియమిస్తుంది.టికెట్ ఛార్జీలు.. తనిఖీలు.. రైళ్లనిర్వహణ.. క్యాటరింగ్ లాంటి విషయాల్ని మాత్రం ప్రైవేటు కంపెనీలే చూసుకోనున్నాయి. భారత్ లోని రైళ్ల రూట్లను సొంతం చేసుకోవటానికి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. బడా కంపెనీలు బరిలోకి రానున్నాయి. ప్రస్తుతానికి ప్రైవేటు రైళ్లను సొంతం చేసుకోవటానికి ఉత్సాహాన్ని చూపిస్తున్న కంపెనీల విషయానికి వస్తే..

- జీఎంఆర్‌

- బొంబార్డియర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌

- స్టెరిలైట్‌ పవర్‌

- మేధా

- భారత్‌ ఫోర్జీ

- ఐఆర్‌సీటీసీ

- సీఏఎఫ్‌ ఇండియా

- భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)

- మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌

- ఐబోర్డ్‌ ఇండియా

- జేకేబీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌

- హింద్‌ రెక్టిఫైర్స్‌

- టిటగర్హ్‌ వ్యాగర్‌

- గేట్‌వే రైల్‌

- జాసన్‌ ఇన్‌ఫ్రా

- ఆర్‌కే అసోసియేట్‌ అండ్‌ హోటల్

దేశ వ్యాప్తంగా రద్దీగా ఉన్న రూట్లను ప్రైవేటు రైళ్లను పరుగులు తీయనున్నారు. మొత్తం 151 రైళ్లను పట్టాల మీదకు తీసుకొస్తారు. మొత్తం 109రూట్లలో ఈ రైళ్లు నడుస్తాయి. ఒక్కో రైలులో 16 బోగీలు ఉంటాయి. ఈ రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 160కి.మీ. 2022-23 నుంచి 2026-27 నాటికి మొత్తం రైళ్లను అందుబాటులోకి తేనున్నారు. దక్షిణాదిన ఏయే రూట్లలో ఈ రైళ్లు రానున్నాయి? అన్న విషయంలోకి వెళితే.. సికింద్రాబాద్ - శ్రీకాకుళం (వయా విశాఖ), సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ - గుంటూరు, కర్నూలు - గుంటూరు, తిరుపతి - వారణాసి (వయా సికింద్రాబాద్), తిరుపతి - ముంబయి, ఔరంగాబాద్ - ముంబయి, విశాఖపట్నం - విజయవాడ, విశాఖ - బెంగళూరు(వయా రేణిగుంట), విశాఖ - హోరా రూట్లతో పాటు మరిన్నిరూట్లలోనూ రైళ్లు నడవనున్నాయి.

చెన్నై మార్గంలో చూస్తే.. చెన్నై-మధురై, చెన్నై-ముంబయి, చెన్నై-మంగళూర్, చెన్నై - సికింద్రాబాద్, ఎర్నాకులం - కన్యాకుమారి, చెన్నై-ఢిల్లీ, కొచువేలి- గుహవాటి, తిరునల్వేలి- కోయంబత్తూరు, బెంగళూరు - గుహవాటి, మైసూర్ - భువనేశ్వర్, మైసూర్ - ఢిల్లీ, మైసూర్ - హోరా, మైసూర్ - రాంచి.

Next Story