శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత
By Medi Samrat
తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా వైరస్ సోకడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా దాదాపు 20 ఏళ్లు సేవలు అందించిన ఆయన.. గత ఏడాది పదవీ విరమణ పొందారు.
పదవీ విరమణ అనంతరం ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఏడాదిగా శ్రీవారి కైంకర్యాలకు దూరంగా ఉన్నారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో నాలుగు రోజులకు ముందు స్వీమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఆలయ ప్రధాన అర్చకులుగా దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగిన శ్రీనివాసమూర్తి దీక్షితులుకి ఆలయం తరపున సంప్రదాయ పద్ధతిలో వీడ్కోలు పలకాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. దీక్షితులు అకాల మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.