కరోనా కట్టడి: కఠిన చర్యలకు అస్సలు వెనుకాడొద్దు..

By అంజి  Published on  3 April 2020 2:05 PM GMT
కరోనా కట్టడి: కఠిన చర్యలకు అస్సలు వెనుకాడొద్దు..

ఢిల్లీ: నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ తబ్లిగీ జమాత్‌ మత సమ్మేళనం, ఆనంద్‌ నగర్‌లో వలస కూలీలు గుమిగూడటం కరోనా వ్యాప్తి నివారణకు విఘాతంగా మారాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలు కరోనా నియంత్రణకు ఎదురుదెబ్బలంటూ ఆయన అభివర్ణించారు.

శుక్రవారం అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత అధికారులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు అవుతుండటంతో ప్రజలెవ్వరికి కూడా ఆహారం విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్రపతి సూచించారు. అలాగే మహమ్మారి వైరస్‌ కట్టడి చేసేందుకు కఠిన చర్యల విషయంలో వెనుకాడొద్దన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని గవర్నర్లకు సూచించారు.

Also Read: ప్రపంచం ఆకలి కేకలతో మారుమ్రోగనుందా..?

కనిపించని శత్రువుతో పోరాడుతున్నప్పుడు నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని పేర్కన్నారు. పలు ప్రాంతాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులపై దాడి ఘటనల గురించి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రపతి ప్రస్తావించారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో దేశ ప్రజలు క్రమశిక్షణతో పాటు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించాలన్నారు.



వైరస్‌ కట్టడికి నిజాముద్దీన్‌ మర్కజ్‌, ఆనంద్‌ నగర్‌లో వలస కూలీలు గుమిగూడటం ఊతమిచ్చాయన్నారు. అందరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలన్నారు. సరైన జాగ్రత్తల అంశంలో రాజీ ప్రశ్నే లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

Next Story