మనుషులను నమ్మిన ఏనుగు.. ఆఖరికి బిడ్డతో సహా ప్రాణాలొదిలింది..
By తోట వంశీ కుమార్ Published on 3 Jun 2020 11:31 AM GMTసాటి మనిషి కష్టాల్లో ఉంటే.. వారిని ఆదుకోగలిగే స్థోమత ఉన్నా.. సహాయం చేయకపోగా చూసి కడుపారా నవ్వుకునే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఇంట్లో పెంచుకునే జంతువులకు వయసు అయిపోతే వాటి యజమానులు అవి చూపిన విశ్వాసాన్ని మరిచిపోయి.. వాటిపట్ల క్రూరంగా ప్రవర్తించిన సంఘటనలెన్నో చూస్తున్నాం. ఇది కథ కాదు.. నిజంగా జరిగిన యదార్థ సంఘటన. చదువుతున్న మీకు నిజంగా మనసు అనేదే ఉంటే.. అది చలించక మానదు. ఆ గర్భిణీ అయిన ఏనుగు పట్ల మనుషులు ప్రవర్తించిన తీరుపై కోపం వస్తుంది. కానీ..ఇప్పుడు ఎవరూ ఏం చేయలేరు. ఈ హృదయ విదారకమైన ఘటన గత నెల కేరళలో జరిగింది.
విషయంలోకి వెళ్తే.. మానవత్వానికే మాయని మచ్చలా మిగిలిపోయే ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. గర్భంతో ఉన్న ఏనుగు సైలెంట్ వ్యాలీ వద్ద ఉన్న ఓ గ్రామంలోకి ఆహారం కోసం వచ్చింది. పాపం అది గ్రామంలో ఉన్న ప్రజలను ఏమీ చేయలేదు. నెమ్మదిగా ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తుండగా.. గ్రామంలోని కొంతమంది దానికి పైన్ ఆపిల్ ఆశ చూపారు. పాపం ఆ ఏనుగుకు తెలీదు..అది తన కడుపు నింపే పండు కాదు..ప్రాణాలు తీసే పండు అని. ఏనుగుకు ఇచ్చిన పండులో బాంబ్ పెట్టారు గ్రామస్తులు. ఎంతో ఆశగా వారి వద్ద నుంచి తొండంతో పైన్ ఆపిల్ తీసుకున్న ఏనుగు దానిని నోటిలో పెట్టుకోగానే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ పేలుడుతో ఏనుగు నోటి వెంట రక్తం ధారాళంగా కారింది.
ఓ పక్క మనుషులు నమ్మించి మోసం చేశారన్న బాధ, మరో పక్క నోటికి తగిలిన దెబ్బ.. దానిపై వాలుతున్న ఈగలు.. ఇంకోపక్క తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆకలి తీర్చాలి. మనుషులు చేసింది మోసమని తెలిసినా.. పాపం ఆ ఏనుగు వారినేమీ చేయలేదు. సైలెంట్ గా ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోయింది. అలా వెళ్తుండగా దారిలో ఉన్న వెల్లియార్ నదిలోకి దిగి ఏనుగుకు నీటి ప్రవాహంతో కాస్తంత ఉపశమనం పొందింది. అలాగే అందులో నీరు తాగుతూనే కడుపు నింపుకుంది. ఆ నీటిలో ఉంటేనే గాయం మీద ఈగలు వాలకుండా ఉన్నాయని..అందులోనే ఉండిపోయింది ఏనుగు.
ఇంతలో ఎవరో అటవీశాఖ సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు సురేందర్, నీలకంఠన్ అనే మరో రెండు ఏనుగులను నదిలోకి దింపి ఆ ఏనుగును పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ దానికి తగిలిన గాయంతో అది ఎటూ కదల్లేని పరిస్థితిలో అక్కడే ఉండిపోయింది. ఆఖరికి మే 2వ తేదీ సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో బిడ్డతో సహా ప్రాణాలు విడిచింది. విగతజీవైన ఏనుగును పరిశీలించిన అధికారులు అది గర్భంతో ఉందని గ్రహించి కంటతడి పెట్టుకున్నారు. ఆఖరికి మల్లప్పురం అటవీశాఖ అధికారులే ఆ ఏనుగుకు అంత్యక్రియలు నిర్వహించారు. చూశారా..నోరు లేని జీవాల పట్ల మనుషులు ప్రవర్తించిన తీరుతో..కడుపులో ఉన్న బిడ్డకోసమైనా తన ఆకలి తీర్చుకునేందుకు జనావాసాల మధ్యలోకి వచ్చిన ఏనుగుకు జరిగిన దారుణమిది. ఈ విషయాన్ని అక్కడి అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో..వెలుగులోకొచ్చింది.