ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం.. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ షాక్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2020 1:48 PM IST
ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో ప్రభాస్ పుట్టిన రోజున భారీ ప్లెక్సీ కట్టి, సెలబ్రేషన్స్ చేసుకోవాలని భావించిన ఆ అభిమానులకు అదే ఆఖరు రోజైంది. విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అభిమానులు మృతి చెందారు.
ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పూనురులో సుగుణా రావు అనే అభిమాని పెద్ద ప్లెక్సీని తయారు చేయించాడు.దాన్ని బహిరంగంగా ప్రదర్శించాలన్న ఉద్దేశంతో కడుతున్న వేళ, పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు సుగుణా రావుకు తగిలాయి. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇదే ఘటనలో ప్లెక్సీ కట్టేందుకు సాయం చేస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పూనురులో విషాద వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలిని సందర్శించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు.
మరో పక్క పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్ల మండలంలో కూడా విషాదం చోటు చేసుకుంది. అక్కడ నలుగురు యువకులు ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ తీగలు తాకడంతో గండికోట దుర్గాప్రసాద్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మిగతా ముగ్గురు యువకులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.