ఎన్నాళ్లకెన్నాళ్లకు ప్రభాస్ అభిమానుల్లో ఆనందమో..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 July 2020 8:07 AM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు ప్రభాస్ అభిమానుల్లో ఆనందమో..!

ప్రభాస్ ఒకప్పుడంటే ఏడాదికి రెండు సినిమాలు చేసే వాడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కావడంతో రెండేళ్లకు ఒక సినిమా రావడం కూడా గగనమే..! మనోడి రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని ప్రభాస్ అభిమానులు ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రభాస్ సినిమాల అప్డేట్స్ విషయంలో మాత్రం మూవీ మేకర్స్ చాలా జాప్యం చేస్తూ ఉంటారు. మా హీరో సినిమా అప్డేట్ ఇవ్వండయ్యా అని సామాజిక మాధ్యమాల్లో ఎంతగానో మొత్తుకుంటూ ఉంటారు. ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ వినిపించింది.

కొన్ని నెలల వెయిటింగ్ తర్వాత ప్రభాస్ 20వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ పై చిత్ర నిర్మాతలు అఫీషియల్ ప్రకటన చేశారు. లాక్ డౌన్ విధించిన సమయం నుండి ఒక్క అప్డేట్ అయినా ఇవ్వమని అభిమానులు కోరుతూనే వస్తున్నారు. కానీ ఏ ఒక్క అప్డేట్ కూడా వారికి అందలేదు. ఎట్టకేలకు ఇప్పుడు అభిమానులకు కావాల్సిన అప్డేట్ ఇవ్వనున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఫస్ట్ లుక్ కు సంబంధించిన అప్డేట్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. జులై 10న ప్రభాస్ 20 వ సినిమాకు సంబంధించిన అప్డేట్ రానుంది. ఉదయం 10 గంటలకు భారత కాలమానం ప్రకారం విడుదల చేయనున్నట్లు పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

“#Prabhas20. #BhushanKumar T-Series. Radha Krishna Kumar UV Creations #VamsiReddy #PramodUppalapati #PraseedhaUppalapati #KrishnamRaju” అంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ గడియారం 10 గంటలు చూపిస్తున్న ఫోటోను అప్లోడ్ చేశాడు డార్లింగ్. పాత గడియారం, చుట్టూ రోజా పువ్వులు, ఒకప్పటి గోడ.. వీటికి సినిమాకు ఏదో లింక్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తూ ఉండగా.. బాలీవుడ్ నటి భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటూ, హిందీ, తమిళం, మలయాళంలలో విడుదల చేయనున్నారు. సినిమాకు పేరు ఏది పెట్టారు అన్నది కూడా త్వరలోనే తెలియనుంది.

మూవీ మేకర్స్ సడన్ గా ప్రభాస్ సినిమా అప్డేట్ అంటూ చెప్పడంతో అభిమానులు కూడా ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు. లాక్ డౌన్ ముందు జార్జియాలో ఈ సినిమా షూటింగ్ కొంత భాగాన్ని చేసుకుని వచ్చారు. ఇంకొద్ది రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు ప్రభాస్.

Next Story