కన్నీళ్లు తెప్పిస్తున్న సుశాంత్ 'దిల్ బేచారా' ట్రైలర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 July 2020 11:36 AM GMT
కన్నీళ్లు తెప్పిస్తున్న సుశాంత్ దిల్ బేచారా ట్రైలర్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ప్రజలు ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. సుశాంత్ నటించిన ఆఖరి సినిమా 'దిల్ బేచారా' ట్రైలర్ విడుదలవ్వగా.. ఆ ట్రైలర్ ను చూసి అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. పలువురు ప్రముఖులు 'దిల్ బేచారా' ట్రైలర్ ను తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తున్నారు. సోమవారం విడుదలైన ట్రైలర్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. సుశాంత్ సింగ్ స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా అందరిలోనూ ఓ భావోద్వేగం అన్నది కనిపించింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సంజన సంఘీ మ్యాజికల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అందరికీ బాగా నచ్చింది. సుశాంత్ సింగ్ ట్రైలర్ లో చెప్పిన ఓ వాక్యం అందరి హృదయాలను తాకింది. 'మనం ఎప్పుడు పుడతామో, ఎప్పుడు మరణిస్తామో మన చేతుల్లో లేదు. ఎలా బ్రతికాము అన్నది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది' అంటూ సుశాంత్ చెప్పిన డైలాగ్ అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. సుశాంత్ మన మధ్య లేకపోవడంతో ఈ డైలాగ్ మరింత ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది.

సామాజిక మాధ్యమాల్లో సుశాంత్ ఆఖరి సినిమా అయిన 'దిల్ బేచారా' ట్రైలర్ ను పలువురు అభినందిస్తూ పోస్టులు పెట్టారు. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబై లోని తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే..! సుశాంత్ మానసిక వేదనతో చనిపోయాడని తెలుస్తోంది. ఈ మరణంపై పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పలువురిని పోలీసులు విచారించారు.

జాన్ గ్రీన్ బెస్ట్-సెల్లింగ్ నవల అయిన The Fault In Our Stars ను దిల్ బేచారా సినిమాగా మలిచారు. క్యాన్సర్ తో బాధపడుతున్న కిజి(సంజనా సంఘీ) జీవితంలోకి మ్యానీ(సుశాంత్ సింగ్ రాజపుత్) వచ్చాక ఎటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయన్నది ఈ ట్రైలర్ లో చూపించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కాలేజీ విద్యార్థిగా నటించాడు.

దిల్ బేచారా సినిమాకు ముకేశ్ ఛాబ్రా దర్శకత్వం వహించాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జులై 24న ఈ సినిమా విడుదల కాబోతోంది. సబ్ స్క్రైబ్ర్లు, నాన్ సబ్ స్క్రైబర్లు ఈ సినిమాను చూడొచ్చు అని సంస్థ తెలిపింది. సుశాంత్ సినిమాను ఆన్ లైన్ లో కాకుండా థియేటర్ లో విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించినప్పటికీ ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరచే అవకాశం లేకపోవడంతో నిర్మాతలు ఆన్ లైన్ రిలీజ్ కే మొగ్గు చూపారు.

పలువురు నటీ నటులు ఈ సినిమా ట్రైలర్ ను ప్రమోట్ చేశారు. ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమా ట్రైలర్ ను పోస్ట్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం చివరి సారి అంటూ ఈ చిత్రంలో లవ్, ఫ్రెండ్షిప్, లైఫ్ అన్నిటినీ చూపించారని తెలిపింది. “#SushantSinghRajput one last time... #DilBechara, a celebration of love, friendship and life.Red heart Watch the trailer.” అంటూ ప్రియాంక చోప్రా ట్వీట్ చేసింది.

Next Story