ఎలిజబెత్-2, ఇవాంకాలను వెనక్కి నెట్టిన నిర్మలా సీతారామన్‌

By సుభాష్  Published on  13 Dec 2019 7:03 AM GMT
ఎలిజబెత్-2, ఇవాంకాలను వెనక్కి నెట్టిన నిర్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. క్వీన్ ఎలిజబెట్-2, ఇవాంకా ట్రంప్‌ల కంటే శక్తివంత మహిళ అని ఫోర్బ్స్ స్పష్టం చేసింది. ప్రపంచంలోని వంద మంది అత్యంత శక్తివంత మహిళలతో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ ఏడాదికిగాను 16వ వార్షిక జాబితాను విడుదల చేసింది. ఇందులో నిర్మలా సీతారామన్ 34వ స్థానంలో నిలిచారు. 38వ స్థానంలో బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన ముద్దుల కూతురైన ఇవాంకా ట్రంప్ 42వ స్థానంలో ఉండటం గమనార్హం.

న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ కూడా నిర్మలా సీతారామన్‌ తర్వాతే ఉండటం విశేషం. కాగా, ఈ జాబితాలో జర్మనీ ఛాన్స్‌ల ర్ ఏంజిలా మెర్కెల్ వరుసగా తొమ్మిదో ఏడాది అగ్ర స్థానంలో ఉండగా, రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురా లు క్రిస్టిన్ లగార్డే నిలిచారు. బ్రిటన్ ప్రధానిగా రాజీనామా చేయడంతో ఈసారి జాబితాలో థెరిస్సా మే లేరు. గతేడాది జాబితాలో ఈమె రెండో స్థానంలో ఉన్నారు. దేశ తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్.. క్షీణిస్తున్న భారత జీడీపీ సవాళ్లను ఎదుర్కొంటున్నది తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో ఉల్లిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలూ నిర్మలను విమర్శలపాలు చేశాయి. ఈ క్రమంలో ఫోర్డ్స్ తాజా ర్యాంకింగ్ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

Next Story