వాళ్లకు పెళ్లంటే నిజంగా ఆటే. ఆ పెళ్లిలో టెన్నిస్ ఏస్ లకు జవాబుగా క్రికెట్ స్క్వేర్ కట్ లు మోతలు మోగించాయి. అబ్బాయి తండ్రి ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ అజ్జూ భాయి అలియాస్ అజహరుద్దీన్. అమ్మాయి అక్క విశ్వ విఖ్యాత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అలాంటప్పుడు పెళ్లి ధనాధన్ ఫటాఫట్ కాకుంటే మరేమౌతుంది.

1

పెళ్లి కొడుకు సెహ్రా, గోల్డెన్ గలా బంధ్ షేర్వానీ తో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ లా పెళ్లి అనే క్రికెట్ ఫీల్డులో దిగితే, బేబీ పింక్, ఊదా రంగుల ఖరా దుపట్టా, ఘాగ్రాలతో అమ్మాయి “లవ్ వన్” స్కోర్ చేసేసింది. ఇద్దరూ కలిస్తే ఏస్ ల మీద ఏస్ లు, బౌండరీల మీద బౌండరీలు. ఇక “మ్యాచ్ పాయింటే” మరి. బుధవారం రాత్రి బంజారాహిల్స్ లోని మీర్జా మంజిల్ దీప కాంతులు, పూల బంతులతో జిగేల్ ధగేల్మంటూండగా, మార్ఫా డప్పుల మోతలతో హోరెత్తిస్తూ గుర్రమెక్కిన పెళ్లికొడుకు ఎంట్రీ ఇచ్చాడు. రాత్రి ఏడున్నరకు మొదలైన నికాహ్ మధ్యరాత్రి దాటిపోయినా సాగుతూనే ఉంది. దోస్తులు, రిష్తెదార్ల చిందులు, విందులతో బంజారాహిల్స్ మోత మోగిపోయింది.

2

పెళ్ళి కొడుకు మహ్మద్ అసదుద్దీన్, పెళ్లి కూతురు ఆనమ్ మీర్జాలు పలువురి దువాలతో, పదిమంది ఫతేహాలతో, ఆయత్ లు చదువుకుంటూ దాంపత్యమనే కొత్త మ్యాచ్ ను మొదలుపెట్టారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆనమ్ మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా, అజహర్ లో చిన్నప్పుడు క్రీడా మైదానంలో కలిసి ఆడుకున్నారు. ఇప్పుడు వారిద్దరి సంతానం దాంపత్య మైదానంలో కలిసి ఆడుకోబోతున్నారు.

4

ఇక పెళ్లి గురించి చెప్పాలంటే అసలే బంజారా హిల్స్... అందునా “హైదరాబాదీదనమే” ధనంగా ఉన్న రెండు పాత పరంపరల కుటుంబాలు...ఇక బిరియానీ డేగిశాలు దిగాల్సిందే. మార్ఫా మోతలు మోగాల్సిందే...తీన్మార్ స్టెప్పులు పడాల్సిందే. మధ్య మధ్యలో మరగ కాచి, పొగలు కక్కే మన ఇరానీ చాయ్ తాగాల్సిందే... పెళ్లికి పిలిచిన హితులు, సన్నిహితుల సంఖ్య తక్కువే అయినా, వచ్చిన వాళ్లందరూ తెగ స్టెప్పులు వేసేశారు. సినీ నిర్మాత దర్శకురాలు ఫరా ఖాన్ సానియాకు ప్రాణ నేస్తం. ఉపాసనా కొణిదెల కుటుంబం అజహర్ కు చాలా దగ్గర, దాంతో వీరంతా సందడి చేసేశారు. వీరంతా చాలదన్నట్టు సానియా పుత్రుడు ఇజ్ హాన్ కూడా తనవంతు అల్లరి చేసేశాడు. ఈ మధ్యలోనే కాజీల ముందు, ఖురాన్ సమక్షంలో ఆనమ్ “కుబూల్ హై” అంది. ఆ తరువాత అసద్ కూడా “కుబూల్ హై” అన్నాడు. ఆ క్షణంలోనే వారిద్దరు “మియా బీబీ” అయిపోయారు.

ఇక మియా బీబీ రాజీ అయిపోతే కాజీ క్యా కరేగా.... “ముబారక్” చెప్పడం, దువ్వాలు ఇవ్వడం తప్ప!!

న్యూస్ మీటర్ కూడా కిలో మీటర్ల పొడవైన “ముబారక్” న్యూలీ వెడ్ కపుల్ కి చెబుతోంది. ఆల్ ది వెరీ బెస్ట్!!

Newsmeter.Network

Next Story