బీజేపీ , టీఆర్‌ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ: పొన్నం ప్రభాకర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Nov 2019 11:03 AM GMT
బీజేపీ , టీఆర్‌ఎస్‌లు ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీ: పొన్నం ప్రభాకర్‌

ముఖ్యాంశాలు

  • బీజేపీ , టీఆర్ఎస్ లపై పొన్నం ప్రభాకర్ ఫైర్
  • ఆర్టీసీ సమ్మెపై బీజేపీ, టీఆర్ఎస్ లపై నాటకాలు ఆడుతున్నాయి
  • బీజేపీ, టీఆర్ఎస్ లు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ
  • టీఆర్ఎస్ దుర్మార్గాలు చేస్తుంటే బీజేపీ ఏం చేస్తుంది?
  • మిడ్ మానేరుపై టీఆర్ఎస్, బీజేపీలు విచారణ జరిపించగలవా?: పొన్నం ప్రబాకర్

హైదరాబాద్ :కేంద్రానికి 30శాతం వాటా ఉన్నా ఆర్టీసీ సమ్మె విషయంలో బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె దాదాపు ఎండ్‌కు వచ్చేసిందన్నారు. ఈ సమయంలో ఏదో చేస్తున్నట్లు బీజేపీ నాటకాలు ఆడుతుందన్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి ఫోన్‌లో సీఎం కేసీఆర్‌ కోసం ప్రయత్నిస్తే..ఆయన మాట్లాడలేదు అనడం బీజేపీకి సిగ్గు చేటు అన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. బీజేపీ - టీఆర్‌ఎస్‌లు గల్లాలో కుస్తీలు పడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నడ్డా టీఆర్‌ఎస్ పై ఆరోపణలు చేస్తే ఎందుకు సీబీఐ చేత విచారణ జరపరని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ దుర్మార్గానికి ఒడి కడుతుంటే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కుక్కలు పడ్డాక ఆర్నెళ్లకు మిడ్ మానేరు ప్రాజెక్ట్ ను సందర్శించారని పొన్నం మండిపడ్డారు. లీకేజ్‌ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే తప్పు అంటున్నారు. అంటే మిడ్ మానేరు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని ఒప్పుకుంటున్నారా అని టీఆర్‌ఎస్‌ నేతలను ప్రశ్నించారు పొన్నం.

ఒకవేళ కాంగ్రెస్ హయాంలోనే తప్పిదం జరిగితే విచారణ జరిపించవచ్చు కదా అంటూ సవాల్ విసిరారు. బీజేపీకి సోయి ఉంటే మిడ్ మానేరుపై విచారణ జరిపించాలన్నారు. అన్ని ఆధారాలు తాము ఇస్తామన్నారు. ఆర్టీసీ, మిడ్ మానేరు అంశాలలో టిఆర్ఎస్, బీజేపీ లకు బాధ్యత ఉంది. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్యానికి తెలంగాణలో విపత్తు : సంపత్, అద్దంకి దయాకర్‌

కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు సంపత్, అద్దంకి దయాకర్‌.

కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు రైతు బంధులేదన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు. ఆర్టీసీ విషయంలో ఎంత చెప్పినా తక్కువేనంటూ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్ధయగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ..ప్రజలను విస్మరించి పాలకులు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటాలు సాగిస్తోందన్నారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా ఇంత దుర్మార్గంగా పాలన సాగడం లేదన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం విపత్తులో ఉంది. మీడియాను కూడా అనగతొక్కి పాలిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పై విపరితమైన ఒత్తిడి వల్ల నిజాలు బయటకు రావడం లేదన్నారు.

కేటీఆర్, హరీష్ రావు లు ఎక్కడ పోయారు? అడ్రస్ లేరంటూ ప్రశ్నించారు. తెలంగాణ సమస్యలు వీళ్లకు కనపడడం లేదా..? ఒక్కరు కూడా మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విషయలలో జోక్యం చేసుకునే ఈ చింటూ, పింటు లు ఎక్కడ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

Next Story