సెప్టెంబర్ 17న కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం

By అంజి  Published on  5 Sep 2023 5:48 AM GMT
YS Sharmila, YSR Telangana Party, Congress, Rahul Gandhi

సెప్టెంబర్ 17న కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని న్యూఢిల్లీ నుంచి వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల హాజరయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. గతవారం న్యూఢిల్లీలో సోనియా, రాహుల్‌లను కలిసిన షర్మిల.. అగ్రనాయకత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆమె తన పార్టీని ఎప్పుడు కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనేది సందిగ్ధంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో జరిగే కాంగ్రెస్ ర్యాలీకి ఆమె హాజరవుతారని పార్టీ నాయకత్వం సోమవారం తెలిపింది.

సెప్టెంబర్ 16న హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని, ఆ తర్వాత సెప్టెంబర్ 17న పొడిగించిన సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. తర్వాత హైదరాబాద్‌లో భారీ ర్యాలీ జరగనుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ మాజీ చీఫ్‌ రాహుల్‌గాంధీని షర్మిలా కలిశారు. ఇది చాలా స్నేహపూర్వక సమావేశం, చాలా మంచి సమావేశం అని ఆమె స్వయంగా మీడియాకు వివరించారు. అయితే హైదరాబాద్‌లో జరగనున్న సమావేశానికి హాజరు కావాలని షర్మిలను హైకమాండ్ కోరినట్లు తెలుస్తోంది. “ఇది ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనానికి సంకేతాలను పంపుతుంది. అధికారిక విలీనాన్ని ప్రకటించడానికి ఆమె ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని నిర్వహించవచ్చు”అని వర్గాలు తెలిపాయి.

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకునే సెప్టెంబర్ 17 సాయంత్రం హైదరాబాద్‌లో పార్టీ “మెగా ర్యాలీ” నిర్వహిస్తుందని, ఆ తర్వాత తెలంగాణకు ఐదు హామీలను ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరి తన పార్టీని విలీనం చేస్తే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రాండ్ ఓల్డ్ పార్టీకి బూస్ట్‌గా అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపేందుకు మేలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను బెంగళూరులో కలిసిన తర్వాత షర్మిల కాంగ్రెస్‌కు మరింత దగ్గరవుతుందనే ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె తన తోబుట్టువు జగన్ మోహన్ రెడ్డి కోసం తీవ్రంగా ప్రచారం చేసింది. తరువాత తెలంగాణలో తన సొంత పార్టీ వైఎస్‌ఆర్‌టిపిని ఆవిష్కరించింది.

Next Story