రెండో సారి సీఎంగా నేడు యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌మాణ‌ స్వీకారం

Yogi Adityanath Swearing Ceremony in Lucknow today.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఈరోజు(శుక్ర‌వారం) యోగి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 March 2022 7:05 AM GMT
రెండో సారి సీఎంగా నేడు యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌మాణ‌ స్వీకారం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఈరోజు(శుక్ర‌వారం) యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌మాణ‌ స్వీకారం చేయ‌నున్నారు. ల‌క్నోలోని ఏకానా స్టేడియంలో సాయంత్రం నాలుగు గంటలకు ఆయ‌న‌ ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజ‌రుకానున్నారు. మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజెపి అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతున్నారు. రెండోసారి వరుసగా సీఎంగా పదవి చేపడుతుండటంతో అంత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి విప‌క్ష నేత‌ల‌కు కూడా ఆహ్వానం అందించారు. సోనియా గాంధీ, అఖిలేశ్ యాద‌వ్‌, ములాయం సింగ్ యాద‌వ్‌, మాయావ‌తి, రాహుల్ గాంధీతో పాటు బాలీవుడ్ న‌టులు అక్షయ్‌ కుమార్‌, కంగనా రనౌత్‌, అజయ్‌ దేవగణ్‌, బోనీ కపూర్‌, దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్‌, ది కశ్మీర్‌ ఫైల్స్ చిత్రబృందం ల‌కు ఆహ్వానాలు పంపారు. వ్యాపార దిగ్గజాలు ఎన్‌.చంద్రశేఖరన్‌, ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, గౌతమ్‌ అదానీ, ఆనంద్‌ మహీంద్రా, సంజీవ్‌ గొయెంకా తదితర పారిశ్రామిక ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. కాగా.. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 403 స్థానాల‌కు గాను భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) 255 సీట్ల‌లో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

గురువారం బీజేపీ శాసన సభాపక్షనేతగా ఎన్నికైన యోగి గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతకుముందు బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో యోగిని ప్రశంసల్లో ముంచెత్తారు హోంమంత్రి అమిత్‌షా. గత 37ఏళ్లలో యూపీలో ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదన్నారు. యూపీలో సుప‌రిపాల‌న‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీయే త‌న‌కు మార్గ‌నిర్దేశం చేశార‌ని యోగి అన్నారు. యూపీలో ఇప్పుడు పండుగ‌ల‌ను ప్ర‌శాంతంగా నిర్వ‌హించుకోవ‌చ్చున‌ని తెలిపారు.

Next Story