కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి దూరమై చాలా రోజులే అవుతోంది. గత కొద్దిరోజులుగా ఆమె బీజేపీలో చేరుతారనే కథనాలు వస్తూ ఉన్నాయి. తాజాగా విజయశాంతి రేపు బీజేపీలో చేరుతున్నారని జాతీయ మీడియా వెల్లడించింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని, రేపు కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కుదిరిందని ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని తెలిపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విజయశాంతిని బీజేపీ కార్యాలయానికి తీసుకుని వెళతారనే ప్రచారం కూడా సాగుతోంది.
90వ దశకం చివర్లోనే రాజకీయ రంగప్రవేశం చేసిన విజయశాంతి మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఆమె 1997లో బీజేపీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. కొద్దిరోజులకు కేసీఆర్ కు విజయశాంతికి మధ్య విభేదాలు రావడంతో విజయశాంతి తల్లి తెలంగాణ పేరిట పార్టీ స్థాపించి రాజకీయంగా దెబ్బతిన్నారు. ఆపై తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ లో తనకు సముచిత స్థానం లేదన్న అసంతృప్తి, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య విబేధాల కారణంగా ఆమె కాంగ్రెస్ పార్టీని వీడాలని అనుకున్నారు.